
రష్యా శాస్త్రవేత్త వ్యాఖ్య
మాస్కో: వందేళ్లు హాయిగా జీవించిన వ్యక్తులను పూర్ణాయుశ్కులు అంటుంటాం. అయితే అంతకంటే మరో 50 ఏళ్లు ఎక్కువే జీవించగల ఎంతో మంది వ్యక్తులు మన మధ్యే ఉన్నారని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్ వ్యాఖ్యానించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న ఈయన ఈయన తాజాగా వైద్య, ఆరోగ్య సంబంధ విషయాలను వివరించే బయోపాలిటిక్స్ ఛానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు.
‘‘వృద్దాప్య ఛాయల్లోకి పడిపోవడం ఇటీవల తగ్గింది. 150 ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానేకాదు. 150 ఏళ్లు జీవించగల సత్తా ఉన్న మనుషులెందరో ఇటీవల పుట్టారు. వాళ్లలో కొందరు ఇప్పుడు 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల వయసులో ఉన్నారు. వృద్దాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. వృద్దాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన. 150 ఏళ్లు పైబడిన తర్వాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయి’’అని ఆయన అన్నారు.
గత నెలలో బీజింగ్‌లోని తియాన్మెన్‌స్కే్వర్‌లో జరిగిన చైనా సైనిక పరేడ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యే అచ్చం ఇలాంటి అంశంపైనే మాటామంతీ జరగడం తెల్సిందే. ‘‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మారి్పడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’’అని జిన్‌పింగ్‌తో పుతిన్ వ్యాఖ్యానించడం తెల్సిందే.