ఏపీలో పని చేసే వయసు వారి జనాభా కూడా తగ్గుదల
2036 నాటికి దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు వృద్ధాప్యంలోకి..
ఇప్పటికే వృద్ధాప్య రాష్ట్రాలుగా తమిళనాడు, కేరళ వర్గీకరణ
యువ జనాభాతో బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హరియాణ రాష్ట్రాలు
వివరాలు వెల్లడించిన ఆర్‌బీఐ నివేదిక
2026లో ఏపీలో వృద్ధుల జనాభా14.1%
అది 2031 నాటికి 16.4 శాతానికి, 2036 నాటికి 18.9 శాతానికి పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: దేశంలోని సగం రాష్ట్రాలు వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు వృద్ధాప్య రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఏపీ 2031 నాటికి వృద్ధాప్య కేటగిరీలోకి వెళ్లనుంది. ఫలితంగా పనిచేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోనుంది. దేశంలో జనాభా పరివర్తన–రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభా వాటా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాన్ని వృద్ధాప్య రాష్ట్రంగా వర్గీకరిస్తారు.
60 ఏళ్ల వయసు జనాభా 10 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటే ఇంటర్మీడియెట్ రాష్ట్రంగా.. 10 శాతం కంటే తక్కువ ఉంటే యువ రాష్ట్రంగా వర్గీకరిస్తారని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2026లో ఏపీలో వృద్ధుల జనాభా 14.1 శాతం ఉండగా.. 2031 నాటికి 16.4 శాతానికి, 2036 నాటికి 18.9 శాతానికి పెరుగుతుందని అంచనా. 2016లో దేశంలోని అన్ని రాష్ట్రాలు యువ లేదా ఇంటర్మీడియట్ కేటగిరీలో ఉండగా.. 2026 నాటికి కేరళ, తమిళనాడు 60 ఏళ్లు పైబడిన జనాభాలో 15 శాతం కంటే ఎక్కువ మందితో వృద్ధాప్య వర్గంలోకి ప్రవేశించాయి.
2036 నాటికి వృద్ధాప్యవర్గంలోకి మరిన్ని రాష్ట్రాలు..
2036 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు వృద్ధాప్య వర్గంలోకి వెళ్లిపోతాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు ఇంటర్మీడియెట్ కేటగిరీలోకి వెళ్లిపోతాయని, ఏ ఒక్క రాష్ట్రం యువత కేటగిరీలో ఉండదని నివేదిక పేర్కొంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హర్యానా వంటి రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో పనిచేసే వయసు వారి జనాభా వాటా 2031 నాటికి దాటి పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది.
ఈ గణాంకాల ప్రకారం తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు, కార్మిక సరఫరాకు ప్రధాన వనరుగా కూడా పనిచేస్తాయని వివరించింది. జనాభా వయసు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, యువత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, ఎక్కువ మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేస్తే, ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లను పెంచే పెద్ద పన్ను ఆధారాన్ని సృష్టించవచ్చని తెలిపింది.
పెరిగిన పట్టణీకరణ వల్ల, వ్యవసాయం వంటి పన్ను విధించని రంగాల నుంచి వైదొలగడం ద్వారా ఈ రాష్ట్రాల్లో పన్ను ఆధారాన్ని మరింత పెంచుతుందని నివేదిక పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా, వృద్ధాప్య రాష్ట్రాల్లో, క్రమంగా తగ్గిపోతున్న శ్రామిక శక్తి దీర్ఘకాలిక వృద్ధి రేటును తగ్గిస్తుందని, తద్వారా పన్ను ఆధారాన్ని, ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్నులను పాక్షికంగా క్షీణింపజేస్తుందని వివరించింది.
యువ రాష్ట్రాలు స్థిరంగా బలమైన ఆదాయ సమీకరణను ప్రదర్శిస్తాయని, ఇది అధిక స్థాయి రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో ప్రతిబింబిస్తాయని, మధ్యస్థ రాష్ట్రాలు సాపేక్షంగా స్థిరమైన ఆదాయ పనితీరును నిర్వహిస్తాయని తెలిపింది. తద్వారా రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో మిత ఫలితాలు ఉంటాయని పేర్కొంది. వృద్ధాప్య రాష్ట్రాలు బలహీనమైన పనితీరును ప్రదర్శిస్తాయని, అలాగే కేంద్రం నుంచి తక్కువ బదిలీలు ఉంటాయని పేర్కొంది.
యువ రాష్ట్రాలు మానవ మూలధన పెట్టుబడులను బలోపేతం చేయడం ద్వారా వారి జనాభా లాభాలను ఉపయోగించుకోవచ్చని, ఇంటర్మీడియెట్ రాష్ట్రాలు వృద్ధాప్యానికి ముందస్తు తయారీతో వృద్ధి ప్రాధాన్యతలను సమతుల్యం చేసుకోవచ్చని తెలిపింది. వృద్ధాప్య రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ, పెన్షన్, శ్రామికశక్తి విధాన సంస్కరణలతో పాటు ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని ఆర్‌బీఐ నివేదిక సూచించింది.




