ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే! | This Indian School Exclusive For Elderly Women Viral Video | Sakshi
Sakshi News home page

ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!

Nov 15 2025 8:24 PM | Updated on Nov 15 2025 8:30 PM

This Indian School Exclusive For Elderly Women Viral Video

అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్‌లా ధరించి.. స్కూల్‌ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. 

మహారాష్ట్రలోని ముర్‌బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్‌ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. 

విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement