మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం! | Tiger rests on cot Viral a bitter reality | Sakshi
Sakshi News home page

మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!

Dec 30 2025 2:51 PM | Updated on Dec 30 2025 2:51 PM

Tiger rests on cot Viral a bitter reality

గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న​ చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.    

మధ్యప్రదేశ్‌ బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్‌ స్టేట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్‌ జిల్లాలోని ధానా ఫారెస్ట్‌ రేంజ్‌లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. 

1973లో మధ్యప్రదేశ్‌లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి.  కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్‌ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. 

ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్‌చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్‌లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్‌లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. 

సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement