ముందుగానే ముదిమి ఛాయలు
ఒత్తిడి, ఒబేసిటీ ప్రధాన కారణాలు
జీవనశైలి మారకుంటే ఇబ్బందే
‘న్యూ సైంటిస్ట్’లో తాజా డేటా
ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య ఛాయలు తమ సహజ గమనంతో కాకుండా, ఇంకాస్త వేగంగా కమ్ముకొస్తున్నాయని వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి, వేడిమి, ఊబకాయం, హృద్రోగాలు, కేన్సర్ వంటివి మనుషుల సహజమైన వయసు (బయోలాజికల్ ఏజ్) పై ప్రభావం చూపి, లేనిపోని వయోభారాన్ని మోపుతున్నాయని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గతంలో కంటే వేగంగా వృద్ధాప్యం తరుముకొస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ వేగాన్ని నెమ్మదింప జేసేందుకు మార్గాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 1965 తర్వాత జన్మించినవారు, అంతకు దశాబ్దం క్రితం జన్మించిన వారి కంటే వేగంగా వార్ధక్యానికి చేరువవుతున్నారని, ఒకప్పుడు వృద్ధులకు శాపంగా పరిణమించిన వ్యాధులు ఇప్పుడు నడి వయసుకు ముందే వచ్చి వాలిపోతున్నాయని వాషింగ్టన్ విశ్వ విద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయనం తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఊబకాయం ఊతమిస్తోంది!
మనుషుల్లో వృద్ధాప్యం వేగవంతం అవుతున్న విషయాన్ని తొలిసారి 2016లో ఊబకాయంపై అధ్యయనం చేస్తున్న స్పెయిన్ వైద్య పరిశోధకుల బృందం గుర్తించింది. ఊబకాయ జీవ సంబంధమైన ప్రభావాలు వృద్ధాప్యాన్ని ముందే తెస్తున్నాయని పేర్కొన్నారు. ఊబకాయం వల్ల కొవ్వు కణాలు కరిగే సామర్థ్యం క్షీణించటం, జీవక్రియల్లో చురుకుదనం తగ్గటం, వాతం మూలంగా మూత్రపిండాలు, ఎముకలు, గుండె నాళాల వ్యవస్థ సహా శరీరంలోని అనేక అవయవాల పనితీరు సన్నగిల్లటం ఇందుకు కారణమని పరిశోధకులు అంటున్నారు.
17% ఎక్కువ వేగం
గత ఏడాది, వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు శీఘ్ర వృద్ధాప్య సంకేతాలను గమనించేందుకు యూకే బయోబ్యాంక్‌లో నిల్వ ఉన్న 1,50,000 మంది రక్త నమూనాలను విశ్లేషించారు. ఆ నమూనాలన్నీ 37 నుంచి 54 ఏళ్ల వారివి. ఆ పరిశోధనలో.. 1965 తర్వాత జన్మించిన వారిలో వృద్ధాప్య ఛాయలు 17 శాతం ఎక్కువ వేగంతో ఉన్నట్లు తేలింది. అంతేకాదు, వారిలో ముందుగానే ఊపిరితిత్తులు, జీర్ణావయవ, గర్భాశయ, పేగు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉన్నట్టు కూడా కనుగొన్నారు.
మార్పులతో మెరుగవోచ్చు
నడి వయస్కులు వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నారంటే అందుకు ప్రధాన కారణం ఊబకాయమే అంటున్నారు పరిశోధకులు. ‘వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్’ డేటా ప్రకారం 5–19 ఏళ్ల వారిలో ఊబకాయం రేట్లు 1975 – 2022 మధ్య సుమారు 1000 శాతం వరకు పెరిగాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా ఊబకాయాన్ని, వృద్ధాప్య వేగాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనవేత్తలు సూచిస్తున్నారు.
‘వేడికీ’ వయసు పైబడుతోంది!
ముందస్తు వార్ధక్యానికి కేవలం ఊబకాయం, ఒత్తిడి, కాలుష్యాలే కాదు.. వాతావరణ మార్పులూ దోహదపడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో.. 56 ఏళ్లు పైబడిన 3,686 మంది వివరాలను పరిశోధకులు విశ్లేషించారు.
వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతలకు గురైన వ్యక్తులు మరింత వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నారని, ఉష్ణోగ్రతలో ప్రతి 10 శాతం పెరుగుదల వారి వయసును 1.4 నెలలు పెంచుతోందని కనుగొన్నారు. గత ఆగస్టులో హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన మరో అధ్యయనంలో 25,000 మంది వయోజనుల డేటా విశ్లేషించి.. అందులోనూ వేడి గాలుల ప్రభావాన్ని గుర్తించారు.
వయోవేగాన్ని ఇలా కొలుస్తారు
ఎవరైనా ఎంత వేగంగా వృద్ధులవుతున్నారో తెలుసుకునేందుకు ‘ఎపిజెనెటి క్’ పరీక్ష చేస్తారు. దానిద్వారా ఆ వ్యక్తి డీఎన్‌ఏలో మార్పులను విశ్లేషించి వారి వృద్ధాప్య వేగాన్ని అంచనా వేస్తారు.
పరిశోధన ముఖ్యాంశాలు
» 1965కి ముందు జన్మించిన వ్యక్తులలో.. ఇటీవలి దశాబ్దాలలో పుట్టినవారిలో కంటే నిదానంగా వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి.
» కొందరు వారి వాస్తవ వయసు కంటే 10 ఏళ్లు ఎక్కువగా లేదా 10 ఏళ్లు తక్కువగా (జీవనశైలి వల్ల) కనిపిస్తున్నారు.
» ఊబకాయం ఉన్నవారి జీవ గడియారాలు వేగంగా తిరుగుతున్నాయి.
» ఆరోగ్యకరమైన ఆహారం, లేదా బరువు తగ్గించే మందుల ద్వారా ఊబకాయాన్ని నివారించటం ద్వారా వయసు మీద పడే వేగాన్ని తగ్గించవచ్చు.
» వృద్ధాప్య వేగాన్ని వ్యాయామం ద్వారా గణనీయంగా తగ్గించుకోవచ్చు.


