ఉదయం వేళల్లో రోగ నిరోధక ఔషధాల వాడకంతో జీవితకాలం పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రోగాన్ని తగ్గించేందుకు మందు వేసుకోవాల్సిందే. అందులో కేన్సర్ వంటి రోగాలకు మందు వేసుకోవడమే కాదు.. వాటిని నిర్ణీత సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జీవితకాలంలో కొంత కోల్పోవాల్సి వస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం, రాత్రి వేళలకన్నా ఉదయం వేళల్లో రోగ నిరోధక మందులు వాడటం వల్ల జీవితకాలం పెరుగుతుందని చైనా శాస్త్రవేత్తలు నిర్వహించిన వివిధ అధ్యయనాల్లో తేలింది.
ప్రమాదకర దశలో ఉన్న స్మాల్‌సెల్ లంగ్ కేన్సర్ (ఎస్‌సీఎల్‌సీ) రోగులకు ఇమ్యునోథెరపీ ఔషధాలను మధ్యాహ్నం 3 గంటల్లోగా అందించడం వల్ల బాధితుల జీవితకాలం పెరుగుతుందని చైనాకు చెందిన సెంట్రల్ సౌత్ యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం తెలిపింది. 2019 మే నుంచి 2023 అక్టోబర్ వరకు 397 మంది రోగులపై జరిపిన ఈ అధ్యయనంలో మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఇమ్యునోథెరపీ తీసుకున్న వారికి సగటున 7 నెలలు అదనపు జీవితకాలం లభించినట్లు తేలింది. ఈ ఫలితాలు తాజాగా కేన్సర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
పరిశోధన ఎలా చేశారంటే..
చైనా పరిశోధకులు అటెజోలిజుమాబ్ లేదా డూర్‌వాల్యూమాబ్ ఇమ్యునోథెరపీ మందులను కీమోథెరపీతో కలిపి పొందిన రోగుల గణాంకాలను విశ్లేషించారు. లింగం, వయసు, ధూమపానం వంటి ఇతర కారకాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. వారిలో మధ్యాహ్నం 3 గంటల్లోగా చికిత్స పొందిన బాధితుల్లో వ్యాధి పెరుగుదల ప్రమాదం 52 శాతం మేర, మరణ ప్రమాదం 63 శాతం మేర తగ్గినట్లు గుర్తించారు.
శరీరంలోని ‘సర్కేడియన్ రిథమ్’ (జీవ గడియారం) ప్రభావంతో రోగనిరోధక కణాల పనితీరు ఒక రోజులో సమయానుసారం మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సీడీ8+ టీ–కణాలకు ఉదయం వేళల్లో కేన్సర్ కణాలపై ఎక్కువ దాడి సామర్థ్యం కలిగి ఉంటోందని ఈ పరిశోధనలో తేలింది. 2019లో వచ్చిన పీఎన్‌ఏఎస్ అధ్యయనం కూడా రోజులో మొదటి భాగంలో ఇచ్చే టీకాలకు ఈ కణాలు మరింత శక్తివంతంగా స్పందిస్తాయని నిర్ధారించింది.
ఉపయోగకర మార్పు..
కేన్సర్‌లోని ఎస్‌సీఎల్‌సీకి మాత్రమే కాకుండా నాన్–స్మాల్‌సెల్ లంగ్ కేన్సర్ (ఎన్‌ఎస్‌సీఎల్‌సీ), కిడ్నీ, మెలనోమా, జీర్ణాశయ కేన్సర్లలోనూ ఈ ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. 2025 ఫిబ్రవరిలో ‘ఈ–బయో మెడిసిన్’లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం ఉదయం 11:30 గంటల ముందు ఇమ్యునోథెరపీ తీసుకున్న ఎన్‌ఎస్‌సీఎల్‌సీ రోగుల మనుగడ దాదాపు రెట్టింపు అయింది. అంతేకాకుండా 13 అధ్యయనాల మెటా–అనాలిసిస్‌లోనూ ఉదయం వేళల్లో చికిత్సకు సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడైంది.
చికిత్స సమయాన్ని మార్చడం, ఖర్చు లేకుండా అమలు చేయదగిన సులభతరమైన ఉపయోగకర మార్పుగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏ ఆసుపత్రిలోనైనా ఇది సాధ్యమేనని, అయితే హాస్పిటల్ షెడ్యూళ్లు, డే కేర్ బెడ్లు, సిబ్బంది లభ్యత వంటి అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయంలో ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. త్వరలో మార్గదర్శకాలు మారే అవకాశమున్నట్లు ఈ అధ్యయన సీనియర్ రచయిత యాంగ్‌చాంగ్ జాంగ్ తెలిపారు.


