రహదారులు 1.15 లక్షల కి.మీ. | Telangana Gets 4 New National Highways | Sakshi
Sakshi News home page

రహదారులు 1.15 లక్షల కి.మీ.

Dec 16 2025 6:22 AM | Updated on Dec 16 2025 6:22 AM

Telangana Gets 4 New National Highways

ప్రస్తుతమున్న 49 వేల కి.మీ. రోడ్ల విస్తరణకు ప్రణాళిక 

జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి ఆరు లేదా 4 లేన్లు 

మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్లు 

రాష్ట్ర రోడ్‌ పాలసీ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభు త్వం రహదారి విధాన పత్రాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న 49 వేల కి.మీ. ప్రధాన రహదారులను 1.15 లక్షల కి.మీ.కు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. మూడు దశల్లో (2030, 2035, 2047 సంవత్సరాల్లో) ఈ ప్రణాళికను అమలు చేయనుంది. వాహనదారులు సురక్షిత ప్రయాణంతోపాటు వ్యయం కూడా తగ్గేలా ఈ చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ రహదారుల విస్తరణలో భాగంగా రింగ్‌రోడ్లు, రేడియల్‌ రోడ్లు కీలక భూమిక పోషించనున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో 21 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి కేంద్రం సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది.

జాతీయ రహదారుల మీదుగా ఉన్న జిల్లా కేంద్రాలు మినహా చాలా జిల్లా కేంద్రాల నుంచి ప్రస్తుతం కేవలం రెండులేన్ల రహదారులు మాత్రమే ఉన్నందున వాటిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా మార్చాలని నిర్ణయించింది. అలాగే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు విధిగా రెండు లేన్ల రహదారులు ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా ఒక మండలం నుంచి మరో మండలానికి వెళ్లే రహదారులు సైతం రెండు లేన్ల రహదారులుగా ఉండాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని సముపార్జించి పెద్ద పారిశ్రామికవాడలు, ప్రధాన పర్యాటక కేంద్రాలు, నిమ్జ్, సెజ్‌లు, ఫార్మా కేంద్రాలు, స్మార్ట్‌ సిటీలు, ప్రధాన ఆదాయవనరులుండే కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు, అలాగే పోర్ట్‌లు, విమానాశ్రయ కేంద్రాలకు కూడా కనీసం నాలుగు లేన్ల రహదారులు ఉండేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  

హైస్పీడ్‌ కారిడార్‌లు.. 
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సహకారంతో పొరుగున ఉన్న రాష్ట్రాల రాజధానులకు మన రాష్ట్రం నుంచి వెళ్లేలా హైస్పీడ్‌(యాక్సెస్‌ కంట్రోల్‌) రోడ్‌ కారిడార్‌లను ప్రతిపాదించింది. ప్రధానంగా నాలుగు రహదారులను ఇందుకోసం సూచించింది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాబోయే సంవత్సరాల్లో సరుకు రవాణాకు, ప్రజల ప్రయాణానికి సులువుగా ఉంటుందని అంచనా. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి, ఇదివరకే గుర్తించి బ్లాక్‌స్పాట్‌లను లేకుండా చేయడానికి ఈ రహదారులు దోహదపడతాయని ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. హైస్పీడ్‌ కారిడార్‌లలో హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌(ఫ్యూచర్‌ సిటీ)–అమరావతి, మచిలీపట్నం పోర్టు, హైదరాబాద్‌– చెన్నై రహదారులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

రోడ్‌ పాలసీకి ఏడు పిల్లర్లు.. 
1. క్రమానుగత రహదారి నెట్‌వర్క్‌ అభివృద్ధి: ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు.. ఇలా అన్ని రహదారులపై ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణానికి వీలుగా అభివృద్ధి పర్చడం. 
2. సమర్థవంతమైన, సఫల నెట్‌వర్క్‌ అందించడం: రహదారుల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, డేటాతో అనుసంధానం చేసేలా ఆధునిక సాంకేతికను వినియోగించి రహదారులను సుదీర్ఘ కాలం వినియోగించుకోవడం. 

3. లోపాలను సరిదిద్దడం: అవసరమైన చోట బ్రిడ్జిలను నిర్మించి రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడటం. 
4. వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా..: ప్రతికూల వాతావరణం, వరదలు, దీర్ఘకాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకుని ఉండేలా సుస్థిర రహదారుల నిర్మాణం 
5. సామాజిక సుస్థిరత, సమ్మిళిత ఆర్థిక ప్రగతి: సమతుల్య అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేలా రహదారి వ్యవస్థను మెరుగుపర్చడం. 

6. వాహనదారులకు సౌకర్యంగా..: సురక్షిత రహదారుల నిర్మాణంలో ఇంజనీరింగ్‌లో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయడం. రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు అవగాహన కలి్పంచడం. 
7. గ్రీన్‌ అండ్‌ స్మార్ట్‌ మొబిలిటీ: పర్యావరణహితమైన పదార్థాలను రహదారుల నిర్మాణంలో వినియోగించడం, యంత్రాల రహిత రవాణా సదుపాయాన్ని పెంచడం. 

రహదారుల విస్తరణ ఎప్పుడు.. ఎలా.. 
రహదారి        ప్రస్తుత కిలోమీటర్లు    2035కి ఎన్నికిలోమీటర్లు    2047కు ఎన్నికిలోమీటర్లు 
జాతీయ రహదారులు        4983            5493                7482 
రాష్ట్ర రహదారులు            1687            4887                8600 
జిల్లా ప్రధాన రహదారులు        11,536            13,096                14,800 
జిల్లాలో ఇతర రహదారులు    15,852            18,097                20,420 
ఎక్స్‌ప్రెస్‌వేలు            ––––––            489                1800 
మొత్తం కిలోమీటర్లు        34,058            42,062            53,102 
లేన్‌–కిలోమీటర్లలో..        46,000        78,411                1,15,000  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement