సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పారీ్టకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం ‘ఆస్క్ కవిత’హ్యాష్ ట్యాగ్‌పై ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు.
యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు.


