ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం’ అని తెలిపారు.
ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 15వ తేదీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42%కు పెంపు చట్టానికి ఆమోదం కోరుతూ ఆందోళన చేపట్టింది జేఏసీ. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేసింది.
సామాజిక రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ధర్నాలో మహేష్‌గౌడ్‌తో పాటు వి. హనుమంతరావు, విల్సన్ ఎంపీ (డిఎంకే), కే. నారాయణ (సిపిఐ), వి. శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, మల్లు రవి ఎంపీ, అనిల్ కుమార్ యాదవ్‌లు హాజరయ్యారు.


