సామూహిక కాల్పుల ఘటనలప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చే అంశం.. అక్కడి గన్ కల్చర్.. సులువైన ఆయుధ చట్టాలు అందుకు కారణమయ్యే పరిస్థితులు. అయితే.. ఇలాంటి దాడులప్పుడు ఆయుధ చట్టాలను కఠినతరం చేయడం పరిపాటిగా మారింది. బాండీ బీచ్ కాల్పుల ఘటన (Bondi Beach Shooting) నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. మరి భారత్‌లో పరిస్థితి ఏంటి?
భారత పౌరుడు గన్ లైసెన్స్‌ను ఆయుధ చట్టం(1959) ప్రకారం మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఎన్‌పీబీ తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా.. ప్రాణాలకు ముప్పు ఉంటేనే తుపాకీ కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తారు. ఆత్మ రక్షణకు తప్ప మరే సందర్భాల్లోనూ వీటిని వినియోగించకూడదు. లైసెన్స్ పొందాలనుకునే వ్యక్తి కచ్చితంగా ఎఫ్‌ఐఆర్ సమర్పించాల్సిందే. తుపాకీ కావాలనుకుంటే కలెక్టరేట్‌లో, ఎస్పీకి మొదటగా అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడిపై గతంలో కేసులున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టి వివరాలు సేకరించిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేశారు.
వ్యక్తిగత రక్షణ, వ్యవసాయ అవసరాలు(జంతువుల నుండి రక్షణ)కు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ లేకుండా ఆయుధం కలిగి ఉంటే జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆయుధాల చట్టం ఉల్లంఘనకు 3-7 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఆయుధాల చట్టం-1959 ప్రకారం ఆయుధాల కలిగి ఉండటం, తయారీ, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, రవాణా చేయడం నేరం.
ఆయుధాల నియమాలు 1962ను రద్దు చేసిన కేంద్రం.. 2016లో కేంద్రం కొత్త ఆయుధాల నియమాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం.. ఆయుధాల లైసెన్స్ కోరుకునే వారు ఏదైనా రైఫిల్ క్లబ్‌లో సభ్యత్వం పొంది గన్ వినియోగం, నిర్వహణపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు వారికి ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు. క్రిమినల్ రికార్డు ఉన్నవారు లైసెన్స్ పొందలేరు. లైసెన్స్ ప్రతి 3 సంవత్సరాలకు రీన్యూ చేయాలి. ఆయుధాన్ని ప్రదర్శన కోసం, భయపెట్టడానికి ఉపయోగించడం చట్ట విరుద్ధం.
నిషేధిత ఆయుధాలు: మిలిటరీలో ఉపయోగించే ఆటోమేటిక్ ఆయుధాలు (AK-47, LMGలు) ఉపయోగించకూడదు
ప్రొహిబిటెడ్ అమ్యూనిషన్ (ఉదా: హై-ఎక్స్‌ప్లోసివ్ బుల్లెట్లు)
వీటిని పౌరులు కలిగి ఉండటం పూర్తిగా నిషేధం
అనుమతించబడిన ఆయుధాలు (వీటికి లైసెన్స్ తప్పనిసరి)
నాన్-ప్రొహిబిటెడ్ బోర్ (NPB) ఆయుధాలు (రివాల్వర్లు, పిస్టల్స్, షాట్‌గన్స్, స్పోర్ట్స్ రైఫిల్స్)
కాగా, ఆస్త్రేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్‌లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు.
ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీలో జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్‌లాండ్ స్టేట్‌లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.


