వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల సంఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఉద్దేశిస్తూ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో చేశారు. దానిలో ట్రంప్ ఆ నిందితుడిని జంతువుతో పోల్చారు. అతను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయపడిన గార్డులను చికిత్స కోసం రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించనట్లు తెలిపారు. ఈ ఘటన దరిమిలా ట్రంప్ నగరానికి అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ సభ్యులను మోహరించాలని ఆదేశించారు.
ట్రంప్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. వాన్స్.. ఆ గార్డులను ధైర్యస్థులు అని కొనియాడగా , ఒబామా ‘అమెరికాలో హింసకు స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. బాధిత సైనికులు, వారి కుటుంబాల కోసం తాను, మిచెల్ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న అనుమానితుడి వివరాలు వెల్లడయ్యాయి. చట్ట అమలు అధికారులు అందించిన సమాచారం ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తిని 29 ఏళ్ల ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకాన్వాల్‌గా గుర్తించారు. ఎన్‌వై పోస్ట్ నివేదిక ప్రకారం లకాన్వాల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ సమయంలో అమెరికాకు వచ్చాడు. అనుమానితుడు కూడా కాల్పుల్లో గాయపడ్డాడు. అయితే అతనికి ప్రాణాపాయం లేదని చట్ట అమలు అధికారి తెలిపారు.
ఈ కాల్పులు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగాయి. దాడి చేసిన వ్యక్తి ముందుగా ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపాడు. అనంతరం కాల్పులతో మరో గార్డును కూడా గాయపరిచాడు. అయితే సమీపంలో ఉన్న మూడవ గార్డు వెంటనే స్పందించి, కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితిపై మొదట్లో గందరగోళం నెలకొంది. వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మోరిస్సే ఆ ఇద్దరు గార్డులు మరణించారని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. గాయపడిన ఈ ఇద్దరు యూఎస్ గార్డ్‌మెన్లు, నేరాలను అరికట్టే మిషన్‌లో భాగంగా మోహరించిన 2,000 మందికి పైగా సైనికులలో సభ్యులు. ఈ దాడి నేషనల్ గార్డ్ దళాల భద్రత, వారి విధి నిర్వహణలో సవాళ్లను మరోసారి ఎత్తిచూపింది.
ఇది కూడా చదవండి: అమెరికాలో కాల్పుల మోత


