అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు
ఇజ్రాయెల్‌నూ లక్ష్యం చేసుకుంటాం
పార్లమెంటు స్పీకర్ ప్రకటన
తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపు
వందలాది మంది మృతి
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు.
ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు.
వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
నిరసనల వెల్లువ!
ఇరాన్‌లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్‌తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్‌లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
మషాద్‌లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు.
నిరసనలపై ఉక్కుపాదమే
ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్‌పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
538 మందికి పైగా బలి !
రెండు వారాలకు పైగా ఇరాన్‌లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్‌లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్‌లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం.
టెహ్రాన్‌లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో 30 మందిని, కెర్మన్‌షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్‌లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు.
బలహీనంగా ఇరాన్
అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.
యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్
ఇరాన్‌ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్‌పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్‌కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం.


