వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు.
చట్ట అమలు సంస్థలు సంఘటనా స్థలం నుండి సేకరించిన నిఘా వీడియోను సమీక్షిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా అనుమానితుడు.. సైనికుల వద్దకు వచ్చి, తుపాకీని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం..సైనికులలో ఒకరు ఆ దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ పరస్పర కాల్పుల ఫలితంగానే అనుమానితుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ కాల్పుల ఘటన వైట్ హౌస్‌కు రెండు బ్లాక్‌ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. సైనికులలో ఒకరికి సీపీఆర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మరొక సైనికుడికి, అదుపులో ఉన్న అనుమానితునికి కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. అలాగే ఆ దారిలో గాజు పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఎఫ్‌బీఐ కూడా సమాఖ్య స్థాయిలో దర్యాప్తులో పాలుపంచుకుంటోంది.


