ఇరాన్‌ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే? | what would happen if Trump attacked Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?

Jan 11 2026 6:48 PM | Updated on Jan 11 2026 6:53 PM

what would happen if Trump attacked Iran

డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్‌ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.


ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. ‍అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్‌లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.

ఇరాన్ సైనిక శక్తి
వెనిజువెలాతో పోలిస్తే ఇరాన్‌ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం.  అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.

ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.

ఇస్లాం దేశాల మద్ధతు
ఇరాన్‌కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్‌ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్‌కు  సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.

మూడో ప్రపంచ యుద్ధం

అయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా  ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement