చమురు కావాలంటే మాతో ఒప్పందం చేసుకోండి
క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ
వాషింగ్టన్: వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తేల్చిచెప్పారు. వెనెజువెలా చమురుకు అతిపెద్ద వినియోగదారు క్యూబా. వెనెజువెలాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని ట్రంప్ సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువుదీరింది.
వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు.
ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికపై క్యూబా స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వెనెజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలడం తథ్యం. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్‌కు సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచి్చన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేíÙస్తున్నారు.


