గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్‌ ట్వీట్‌ | Hyderabad Police Commissioner Vc Sajjanar Tweet On Chinese Manja | Sakshi
Sakshi News home page

గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్‌ ట్వీట్‌

Jan 11 2026 7:42 PM | Updated on Jan 11 2026 7:42 PM

Hyderabad Police Commissioner Vc Sajjanar Tweet On Chinese Manja

సాక్షి, హైదరాబాద్‌: చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతోంది. విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. పతంగుల పండగ నేపథ్యంలో ‘గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్‌ చేశారు. 

చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు’ అంటూ సజ్జనార్‌ హెచ్చరించారు.

కాగా, చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.

ఇవాళ(జనవరి 11, ఆదివారం) హైదరాబాద్‌లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సాయి వర్దన్‌ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్‌ స్టేడియం మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement