అగరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పటికీ, తుపాకీ హింస (Gun Violence) ఆ దేశానికి మాయని మచ్చలా మారింది. తాజాగా వాషింగ్టన్ డీసీలోని ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇది అమెరికా పౌరుల భద్రతను ప్రశ్నిస్తోంది. అంతేకాదు... ప్రభుత్వానికి పలు సవాళ్లను కూడా విసురుతోంది. ఈ ఏడాది అమెరికాలో చోటుచేసుకున్న ప్రధాన కాల్పుల ఘటనలను గుర్తు చేసుకుంటే...
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే న్యూయార్క్, ఇల్లినాయిస్‌లలో జరిగిన కాల్పులతో ప్రారంభమైన రక్తపాతం సంవత్సరం పొడవునా కొనసాగింది. నవంబరు 2025 నాటికి, దేశంలో 370కి పైగా మూక దాడులు (Mass Shootings) నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 360కి పైగా ఉండగా, సుమారు 1,600 మంది గాయపడ్డారు. ఈ వరుస దాడులు అమెరికన్లను నిత్యం భయంలోకి నెట్టేస్తున్నాయి.

ఆంటియోక్ హైస్కూల్‌లో కాల్పులు
2025 ఆరంభంలోనే అంటే జనవరి 22న టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో గల ఆంటియోక్ హైస్కూల్ (Antioch High School) లో కాల్పుల ఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి సోలోమన్ హెండర్సన్ పాఠశాల క్యాంటీన్ వద్ద తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తోటి విద్యార్థిని జోస్సెలిన్ కొరియా ఎస్కలంటే మృతి చెందగా, మరొక విద్యార్థి గాయపడ్డాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పాఠశాలల్లో ఆయుధాలను నియంత్రించే కఠిన చట్టాల ఆవశ్యకతపై చర్చకు దారితీసింది.
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో బీభత్సం
ఏప్రిల్ 17న ఫ్లోరిడాలోని టలహస్సీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (ఎఫ్‌ఎస్‌యూ)లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఉన్నత విద్యా సంస్థల్లో ఈ విధంగా దాడులు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.

న్యూయార్క్ నైట్‌క్లబ్ కాల్పులు
ఆగస్టు 17న బ్రూక్లిన్‌లోని క్రౌన్ హైట్స్ (Crown Heights) లో ఉన్న 'టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్' అనే నైట్‌క్లబ్‌లో విచక్షణారహిత కాల్పులు జరిగాయి. ముఠాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భద్రత లేదనే భయాన్ని ఈ ఘటన మరింతగా పెంచింది.

మిషిగాన్ చర్చిపై దాడి
2025 సెప్టెంబరు 28న మిషిగాన్‌లోని గ్రాండ్ బ్లాంక్ టౌన్‌షిప్ (Grand Blanc Township) లోని ఒక ప్రార్థనా మందిరంపై భీకర దాడి జరిగింది. థామస్ జాకబ్ సాన్‌ఫోర్డ్ అనే దుండగుడు వాహనంతో చర్చిని ఢీకొట్టి, అనంతరం ఆయుధంతో కాల్పులు జరిపి, చివరకు భవనానికి నిప్పు పెట్టాడు. ఈ దాడిలో నలుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రార్థనా స్థలంలో జరిగిన ఈ దారుణం అమెరికాలో విద్వేష భావజాలం పెరుగుదలను సూచించింది.
న్యూజెర్సీలో చిన్నారి బలి
నవంబరు 15న న్యూజెర్సీలోని నెవార్క్ (Newark)లో జరిగిన కాల్పుల ఘటన.. చిన్నారులు కూడా బాధితులుగా మారడాన్ని చూపింది. ఈ దాడిలో 10 ఏళ్ల బాలుడు జోర్డాన్ గార్సియాతో సహా ముగ్గురు పౌరులు మరణించారు. అమాయక చిన్నారులు తుపాకీ తూటాలకు బలికావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ఈ నేపధ్యంలో చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్ వినిపించింది.
ఈ ప్రధాన ఘటనలతో పాటు 2025లో నమోదైన వందలాది ఇతర కాల్పుల ఘటనలను అమెరికా ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలిచాయి. ఆత్మరక్షణ పేరుతో తుపాకులను అందుబాటులో ఉంచుకోవడం అనేది దారుణాలకు దారి తీస్తున్నదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. తుపాకీ నియంత్రణపై రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నంత కాలం ఈ రక్తపాతం ఆగదనే విషయాన్ని 2025 ‘ఘటనలు’ మరోసారి స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: అమెరికాలో కాల్పుల మోత


