వడ్డించేటోళ్ళు మనోళ్ళయితే ఆ కిక్కే వేరప్పా...డిపార్ట్ మెంట్ ఏదైనా...ఫికరే లేదు. మన బాస్ కు మనం కాకా కొడితే చాలు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే సూత్రాన్ని గట్టిగా పాటిస్తే...జీతం అదంతటదే పెరుగుతుంది. తెలివితేటలు, శ్రద్ధ, నిబద్ధత...ఇవన్నీ తుప్పాస్... పెద్ద సార్ ను జాగ్రత్తగా చూసుకుని వారి కనుసన్నల్లో పడుంటే చాలు. అందుకే అక్కడి ఉద్యోగుల్లో కొందరికి ఎడాపెడా ఇంక్రిమెంట్లు వచ్చి పడుతున్నాయి. కారణం బాస్ భజనే. ఇదెక్కడో కాదండోయ్ సాక్షాత్తు న్యాయవ్యవస్థలోనే. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితిలో పడ్డట్టు...ఊరందరికీ న్యాయం చేసే పెద్దమనుషులు తమ కింది ఉద్యోగులకు మాత్రం తమను తోచినట్టుగా....తమకు నచ్చినట్టుగా ఇంక్రిమెంట్లు ఇస్తుండటంతో అందరూ ముక్కున వేలేసేకుని...ఔరా ఇలా కూడా చేస్తున్నారా అనుకుంటూ సన్నాయినొక్కుల నొక్కుతున్నారు.
సాదారణంగా ఓ కంపెనీలో... ప్రైవేటయినా...ప్రభుత్వం అయినా...పనిచేసే ఉద్యోగికి ప్రమోషన్ రావాలన్నా...కనీసం ఇంక్రిమెంట్ పడాలన్నా...సదరు ఉద్యోగి తలప్రాణం తోకకొస్తుంటుంది. ఎంత పనిచేసినా...ఎంత కష్టపడినా...బాస్ గుడ్ లుక్స్ లో లేకుంటే ఆ ఉద్యోగికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల మాట అటుంచి ఉద్యోగం నిలబట్టుకోవడమే కష్టంగా మారిపోతుంటుంది. ఇంక్రిమెంట్లు ఎండమావుల్లా ఊరిస్తుంటాయే కానీ జీతంలో వచ్చి చేరవు. ఏడాదంతా కష్టపడి గొడ్డులా పనిచేస్తే...చివర్లో వచ్చే ఇంక్రిమెంట్ కోసం బిక్కమొగం వేసుకుని ఎదురు చూస్తుంటే... పదో పరకో మొహాన కొట్టే కంపెనీలు ఎన్ని లేవు. అలాగని ఆ ఉద్యోగాన్ని వదిలేసుకునే ధైర్యం చేయలేరు. ఇదేం గానుగెద్దులాంటి జీవితంరా బాబు. ఖర్చులు కొండవీటి చాంతాడంత...జీతం మాత్రం గొర్రబెత్తడంత అని నిట్టూర్చుకోవడం మినహా చేయగలిగేదేం ఉండదు.
ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు తలుపులు తట్టుతుంటాం. మనకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం...గౌరవం. ఎవరు అన్యాయం చేసినా అక్కడ న్యాయం దొరికే దొరుకుతుందని ఆనుకుంటుంటాం. అంతటి ప్రతిష్టాత్మకమైన సర్వోన్నత న్యాయస్థానంలోని ఉద్యోగం చేసేవారిలో కొందరికి అత్యధికంగా ఇంక్రిమెంట్లు దక్కుతున్నాయి. ఎంతటి ప్రతిభావంతుడికైనా ఏడాదికి ఒక ఇంక్రిమెంట్ న్యాయం ధర్మం. కానీ ఇక్కడ మాత్రం కొందరికి ఇబ్బడి ముబ్బడిగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తున్నాయి. పోనీ వారు చేస్తున్న పనికి గుర్తింపా అంటే అదేం కాదు...బాస్ ను మెప్పించినందుకే ఈ నజరానాలు అని తెలుస్తోంది.
సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తులు వారు తమ పదవీ కాలం ముగిసే సమయాన...వ్యవధి ఎంత తక్కువ కాలం అయినా సరే... రిటైర్ అయ్యేటైములో తమకు నచ్చిన వారికి...తమను మెప్పించిన వారికి ఇంక్రిమెంట్లు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తులు కొందరు వెనకాడటం లేదు. ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు వారికి అధికారం ఉందన్న ఏకైక కారణంతో తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనేది విమర్శ. ఉద్యోగులకు వృత్తిగత నైపుణ్యం లేకున్నా...ఏడాదికి రెండు మూడు ఇంక్రిమెంట్లు ఉదారంగా ఇస్తున్నారు. ఇలా లబ్ది పొందన వారిలో సీజేఐ పర్సనల్ సిబ్బందే అధికం.
ఈ అవ్యవహారాన్ని గత నాలుగైదేళ్లుగా గమనిస్తే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000మంది ఉద్యోగులకు ఒక ఏడాదలో పలుసార్లు ఇంక్రిమెంట్లు లభించాయి. ప్రధాన న్యాయమూర్తి కనుసన్నల్లో మెదిలిన కొందరు సిబ్బందికి ఆరుసార్లు ఇంక్రిమెంట్లు పడ్డాయంటే...పరస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుస్తోంది. సాధారణ పరిస్థితిలో లభించే ఇంక్రిమెంట్ల కంటే 150 శాతం అధికంగా లభించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇలా అవ్యవస్థగా సాగిన అవ్యవహారం గురించి చర్చించేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ న్యాయమూర్తులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా చాలా మంది న్యాయమూర్తులు కోర్టు ఎవరి సామ్రాజ్యమో కాదని... ప్రధాన న్యాయమూర్తులు ఇక్కడ రాజులు కారని, వారి ఇష్టారీతిగా ఏదో అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం సరికాదని భావించారు. సుదీర్ఘ చర్చానంతరం ఇలా ఇష్టారీతిగా ఇంక్రిమెంట్లు ఇచ్చే విధానాన్ని బంద్ చేయాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది అలాగే కొందరు ఉద్యోగులకు అర్తరహితంగా ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని కోర్టు భావిస్తోంది. పొరపొటు తెలుసుకుని సరిచేయడం సరే...అసలు సర్వోన్నత న్యాయస్థానంలో కొందరు ప్రధాన న్యాయమూర్తులు ఈ వ్యవహార శైలి ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-ఆరెం.


