మీడియాలో వచ్చే అసత్య కథనాలపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులపై మీడియాలో వచ్చే అసమగ్ర, సత్యదూరమైన కథనాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. ప్రచారం కోసమో సొంత అభిప్రాయాన్ని తెలిపేందుకో వచ్చే ఇటువంటి కథనాల మాయలో తాము పడబోమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు పంపించిన కొందరు వ్యక్తులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే కేసు విషయమై శుక్రవారం చేపట్టిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విజయ్ మాల్యాబాగి్చ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన మేరకు.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన సునాలి ఖాతూన్ అనే గర్భిణీతోపాటు ఆమె 8 ఏళ్ల కుమారుడిని అధికారులు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్‌లో ఉంటున్న తండ్రి వద్దకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా లాయర్లు ధర్మాసనానికి నివేదించారు. ఆమెకు వైద్యసాయం అందుతోందని కూడా తెలిపారు. సరైన విచారణ జరపకుండానే కొందరిని బంగ్లాదేశ్‌కు పంపించారంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌పై జనవరి 6వ తేదీన విచారణ చేపడతామంది.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సరైన విచారణ చేపట్టకుండానే బంగ్లాదేశ్ పౌరులంటూ కేంద్రం కొందరిని బలవంతంగా పంపించి వేసిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఇలాంటివి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇలా ప్రచారం కోసం చేసే స్టంట్లకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేసిన ధర్మాసనం..వీటిని పట్టించుకోవద్దని తుషార్ మెహతాను కూడా కోరింది. ‘వాస్తవానికి న్యాయ వ్యవస్థపై మీడియా ఇలా వ్యాఖ్యానాలను చేయరాదు. మీరు ఇటువంటి అంశాలను ప్రస్తావించడం మంచిదే.
సంబంధిత కథనంతో మీకు ఆవేదన కలగడం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం’అని ధర్మాసనం తెలిపింది. అమెరికా, యూకేల్లో వలసలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై అంతర్జాతీయంగా కథనాలు వస్తున్నాయని, సోషల్ మీడియా, ఇతర వేదికలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయని సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ ధర్మాసనం ఎదుట వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో 20 ఏళ్లుగా ఉంటున్న స్వీటీ బీబీ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలను కూడా అధికారులు బంగ్లాదేశ్‌లోకి పంపించారని మరో లాయర్ సంజయ్ హెగ్డే ప్రస్తావించగా, ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం కోరింది.


