ఆర్గనైజర్, సెక్రటరీ సహా నలుగురిపై అభియోగాలు
గౌహతి: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆర్గనైజర్, వ్యక్తిగత సెక్రటరీ సహా నలుగురు నిందితులపై హత్య అభియోగాలు మోపింది. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. సెపె్టంబర్ 19న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు, అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలో 60కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
అభిమానుల ఆందోళనల నేపథ్యంలో ఈకేసును దర్యాప్తు చేయడానికి అస్సాం ప్రభుత్వం స్పెషల్ డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు, అనేక అరెస్టులు, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం శుక్రవారం ఉదయం సిట్.. 3500పేజీల చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఈకేçసులో 300 మందికి పైగా విచారించినట్లు, ఏడుగురిని అరెస్టు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ చార్జిషీట్‌ను నాలుగు పెద్ద ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జుబీన్ అభిమానులు కోర్టు బయట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ నినాదాలు చేశారు.


