అయోధ్య: ఏళ్ల కిందటి హిందువుల కలను నెరవేరుస్తూ నిర్మితమైన రామమందిరం రెండో వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 31నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం తెలిపింది. ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి‘గా జరుపుకొంటామని వెల్లడించింది. ఆలయ సముదాయంలోని ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ వేడుకకు సంబంధించిన ముసాయిదాను నేడు జరగనున్న సమావేశంలో ఖరారు చేస్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబర్ 31న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ఇద్దరు నాయకులు సంయుక్తంగా జెండాలను ఎగురవేస్తారన్నారు.
నవంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ పర్యటన సందర్భంగా, ఆలయ ప్రధాన శిఖరంపై జెండాను ఎగురవేసినప్పుడు, ఈ ఏడు ఆలయాల శిఖరాలపై జెండాలను ఎగురవేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, ఆలయాల పనులు పెండింగ్‌లో ఉండటం, అనివార్య కారణాల వల్ల ఈ ప్రణాళిక వాయిదా పడిందని ట్రస్టŠట్ వర్గాలు తెలిపాయి. అలంకరణతో సహా ఏడు దేవాలయాల పనులు ఇప్పుడు పూర్తయ్యాయని, ‘ప్రతిష్ఠ ద్వాదశి’ వేడుకల సందర్భంగా జెండాలను ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించాయి. ఈ వేడుకకు సంబంధించిన ఆచారాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి.


