కొడుకు మరణానంతరం కార్యరూపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన జ్ఞాపకం
అహ్మదాబాద్‌లోని కొత్త ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న 61 ఏళ్ల గిర్ధర్‌భాయ్ జిరావాలా కళ్ల ముందు.. విషాద జ్ఞాపకాలు ఒకేసారి మెదిలాయి. వజ్రాల పాలిషింగ్ కార్మికునిగా కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆయన, ప్రస్తుత సొంత ఇంటిని, కొత్త ఫర్నిచర్‌ను చూస్తున్న ప్రతిసారీ, గుండెలో ఏదో తెలియని భారం. ఎందుకంటే, ఇది ఆయన కష్టంతో కొనుక్కున్న ఇల్లు కాదు. అది.. మరణానంతరం ఆయన పెద్ద కొడుకు మహేష్ జిరావాలా నెరవేర్చిన వాగ్దానం. కొద్ది రోజుల ముందు, గిర్ధర్‌భాయ్‌కి గుండెపోటు వచి్చంది. అప్పటివరకు కుటుంబంపై ఉన్న కొంత అప్పుల భారం, నరోడా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఆరుగురు సభ్యుల జీవితం.. ఇవన్నీ ఆయనకు నిద్ర పట్టనివ్వలేదు.
నేనున్నాను నాన్నా..
కానీ, 34 ఏళ్ల సినీ నిర్మాత మహేష్, అన్నీ తానై తండ్రిని చూసుకునేవాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేక, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నాన్నా! మీరు ఇకపై పనికి వెళ్లొద్దు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. నా తాజా సినిమాల నుంచి మంచి ఆదాయం వస్తుంది, దీపావళి లోపు అప్పులన్నీ తీర్చేసి, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తాను’.. అని గట్టిగా మాటిచ్చాడు.
ఆకాశం నుంచి దిగిన మృత్యువు
అప్పటికి మహేష్.. హేతల్‌ను వివాహం చేసుకుని కేవలం మూడు నెలలే అయింది. కొత్త జీవితం, పెద్ద కలలు.. కుటుంబమంతా ఆశగా దీపావళి పండుగ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆశలకు ఆయుష్షు తక్కువైంది. జూన్ 12వ తేదీ.. విధి వక్రీకరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలి, అగి్నకీలల్లో చిక్కుకుంది. ఆ భయంకరమైన విషాదంలో విమానంలోని ప్రయాణికులే కాక, నేల మీదున్న 19 మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ పక్కన రోడ్డుపై నుంచి వెళ్తున్న మహేష్ జిరావాలా కూడా ఆ ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
మరణం తర్వాత నెరవేరిన కల
మహేష్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచినా, అతని వాగ్దానాన్ని మాత్రం మరిచిపోలేదు. విమాన ప్రమాదంలో పరిహారంగా ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ నుంచి మహేష్ కుటుంబానికి రూ.1.25 కోట్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హేతల్‌కు పరిహారంగా రూ.4 లక్షలు లభించాయి. మొత్తంగా అందిన రూ.1.29 కోట్ల నుంచి, మహేష్ భార్య హేతల్ తన వాటా కింద రూ.54 లక్షలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన రూ.75 లక్షలు గిర్ధర్‌భాయ్ చేతికొచ్చాయి.
కొడుకు కల నెరవేర్చాను..
కళ్లలో వేదన సుడులు తిరుగుతున్నా, గిర్ధర్‌భాయ్ మనసులో తన కొడుకు కోరికను నెరవేర్చాలనే తపన బలంగా ఉంది. ‘ఆ రూ.75 లక్షలతో, ముందుగా మహేష్ కలలుగన్నట్టు రూ.15 లక్షల అప్పును తీర్చేశాను. ఆ తర్వాత, రూ.45 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాను.. ఇలా నా కొడుకు కోరికను నెరవేర్చాను’.. అని గిర్ధర్‌భాయ్ చెప్పారు. కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి, మిగిలిన రూ.5 లక్షలను తన మనవరాలి (తమ్ముడు కార్తీక్ కూతురు) భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు. మహేష్ ఆ చిన్నారికి ఆరేళ్లు రాగానే దత్తత తీసుకోవాలని కలలు కనేవాడు.
‘ఆ రూ.75 లక్షల్లో ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలకపోయినా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకపై పనిచేయలేను. నా కొడుకు మరణం తర్వాత కూడా మా కుటుంబానికి గౌరవాన్ని అందించాడు’.. అని వణుకుతున్న గొంతుతో గిర్ధర్‌భాయ్ చెప్పారు. ఆకాశం నుంచి దిగిన మృత్యువు మహేష్ను దూరం చేసింది. కానీ, ఆ బిడ్డ త్యాగం ఒక తండ్రికి.. ఒక కుటుంబానికి ఆర్థిక ఆసరా కలి్పంచింది. సొంత ఇంటి కల నెరవేర్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఇది ప్రేమ.. వాగ్దానం ముందు మరణం కూడా ఓడిపోయిన విషాదగాథ.
– సాక్షి, నేషనల్ డెస్క్


