
ఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా ప్రమాద ప్రాథమిక నివేదిక(Air India Plane Crash Preliminary Report)పై సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పైలెట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్ల ఆధారంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు(Supreme Court) ఇవాళ విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో.. స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న సుప్రీం కోర్టు.. దర్యాప్తు వేగవంతం చేయాలని పేర్కొంది.
పైలెట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు రావడం.. బాధ్యతారాహిత్యమేనని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది దురదృష్టకరం.. బాధ్యతారాహిత్యం’’ అంటూ వ్యాఖ్యానించింది. ప్రమాదానికి కారణం పైలట్ తప్పిదమే అని విచారణ పూర్తికాకముందే ఊహాగానాలు వ్యాప్తి చేయడం తగదని వ్యాఖ్యానించింది. వాస్తవాలు వెలుగులోకి రాకముందే ఈ రకమైన వ్యాఖ్యలు విమాన సిబ్బంది, బాధితుల కుటుంబాలను బాధపెట్టేలా ఉన్నాయంటూ పేర్కొంది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై అభిప్రాయాన్ని తెలియజేయాలని డీజీసీఏ, పౌరవిమానయాన శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయల్దేరిన విమానం కొన్ని సెక్లనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, మెడికల్ కాలేజీ మీద పడడంతో మరో 33 మంది.. మొత్తం 274 మంది మరణించారు. నెల తర్వాత ఏఏఐబీ(Aircraft Accident Investigation Bureau) 15 పేజీలతో ప్రాథమిక నివేదికను బయటపెట్టింది. అందులో..
ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఉంది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారినట్లు గుర్తించారు. దీని వల్ల రెండు ఇంజిన్లు ఒక్కసారిగా ఆగిపోయాయని నివేదిక పేర్కొంది. అలాగే.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో పైలట్లు మాట్లాడుకున్న వివరాలను ప్రస్తావించింది. ఎందుకు కట్ చేశావ్? ఓ పైలెట్ అని ప్రశ్నించగా, "నేను చేయలేదు" అని మరొక పైలెట్ సమాధానం ఇచ్చినట్లు ఉంది. అయితే..

అయితే.. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆ సమయంలో ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ తప్పుపట్టింది. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్ పైలట్స్’ సైతం ముందస్తుగా నిర్ణయాలకు రావడంపై హెచ్చరించింది. ప్రాథమిక నివేదిక సహజంగానే ఎటువంటి సమాధానాలు అందించదని.. దర్యాప్తు పూర్తయ్యేవరకు సంయమనం పాటించాలని కోరింది కూడా. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ.. ఇది ప్రాథమిక దర్యాప్తు నివేదిక మాత్రమేనని, ఈ ఘటనపై ఇంకా పూర్తి దర్యాప్తు నివేదిక వెల్లడి కావాల్సి ఉందని ఓ స్పష్టత ఇచ్చింది.