న్యూఢిల్లీ: అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ, ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది.
గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే అరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.
ఈ వివాదాస్పద నిర్వచనంపై పలు విమర్శలు వచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తిరిగి విచారించాలని నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా ఉపకరిస్తున్నాయని, దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. కాగా గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. సోమవారం జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఆరావళి’పై విచారణ జరిపింది.
ఇది కూడా చదవండి: Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం


