ఆరావళి: కొండల్ని తవ్వితే వాళ్లకు చేటు కాదా?
ప్రపంచంలోనే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులపై వివాదం రాజుకుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయవ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు, వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి.రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సమీపంలో 5,650 అడుగుల ఎత్తులో ఉండే గురుశిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు, జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారత దేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఈ పర్వత శ్రేణులలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది.अरावली सिर्फ़ पहाड़ नहीं, राजस्थान की सांस है। हज़ारों सालों से ये पर्वतमाला हमारी ज़मीन, पानी और जीवन की रक्षा करती आ रही है। इसे बचाना मतलब आने वाली पीढ़ियों को बचाना। #SaveAravalli pic.twitter.com/Yf0RAdPzW5— Tribal Army (@TribalArmy) December 19, 2025సుప్రీంకోర్టు ఏం చెప్పింది?ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం, ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ఈ పర్వతశ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్‌ను సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతకు ఇవి అత్యంత అవసరమని కోర్టు నొక్కి చెప్పింది.కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే, వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చాం. ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టాం. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేం ఇప్పటికే 'గ్రీన్ ఆరావళి వాల్' ప్రాజెక్టును మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19 శాతం మాత్రమే మైనింగ్‌కు అనుమతి ఉంటుంది. వాటిలో కొత్త గనులకు మేం అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 90 శాతం ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి సడలింపును మేం ఇవ్వలేదు. దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'' అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. जब अरावली बचेगी ..तभी जल, जंगल और जीवन बचेगा !!⛰️#SaveAravalli pic.twitter.com/BYG2bM0IdP— Ronak Choudhary (@Ronak_choudhry) December 19, 2025పర్యావరణవేత్తల ఆందోళన.. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 91 శాతం ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతల ప్రాతిపదికన పర్వత శ్రేణుల లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరీవాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరుచేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వతశ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని అంటున్నారు.గుజరాత్లో నిరసనలుప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. 100 మీటర్ల ఎత్తు నిబంధనపై ఈ జిల్లాలోని విజయనగర్‌లో ఉన్న దద్వావ్ ఏరియా ప్రజలు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాణాలను త్యాగం చేసైనా ఆరావళిని కాపాడుకుంటామని వారు ప్రకటించారు. తమ సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వారసత్వంలో కీలక భాగమైన ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. సబర్కాంత జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు ఆరావళి శ్రేణులను పోస్టర్లలో చూసుకోవాల్సిన పరిస్థితిని తేకూడదని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నారు.అధ్యయనాలు ఇలా.. ఇక, తాజా విశ్లేషణ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో ఆరావళిలో పచ్చదనం క్రమంగా కోతకు గురైంది. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే దాదాపు 11,392 చదరపు కిలోమీటర్ల నుండి 7,521 చదరపు కిలోమీటర్లకు అటవీ ప్రాంతం తగ్గిపోయింది. మరోవైపు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ (CURaj) పరిశోధకులు 1975, 2019 మధ్య ఉపగ్రహ చిత్రాలు అధ్యయనం చేసి అంచనాలను రూపొందించారు. వారు విశ్లేషించిన డేటా ప్రకారం 44 సంవత్సరాల కాలంలో 5772.7 చదరపు కిలోమీటర్లు లేదా ఆరావళి శ్రేణులు దాదాపు 8 శాతం చదును చేయబడ్డాయని పేర్కొంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ #సేవ్ఆరావళిఆరావళి పర్వతశ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు #సేవ్ఆరావళి హ్యాష్‌ట్యాగ్‌తో 'ఎక్స్' వేదికగా ట్వీట్లు చేస్తున్నాయి. శ్రేణుల భద్రతను బలహీనపర్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆరావళికి ఏదైనా జరిగితే తిరిగి పొందలేమని, ఇప్పుడే ఆ పర్వతశ్రేణుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.ఆరావళికి గండం వస్తే నష్టాలివే.. ఆరావళి పర్వతశ్రేణుల భద్రతకు భంగం కలిగితే, వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది.All eyes on Aravali …Reminder - Nature belong to everyone #SaveAravalli pic.twitter.com/g5LcSdfQSH— Tsering Gaphel ༅༎ཚིི་ཪིང་དགའ་འཕེལ།། (@Tsering_gaphel) December 24, 2025