గతంలో తామిచ్చిన తీర్పు అమలును నిలుపుదలచేసిన సుప్రీం
నియంత్రణల్లో లోటుపాట్లను పూడ్చాల్సి ఉంది
500 మీటర్ల దూరాల్లో 100 మీటర్లకు మించి ఎత్తులో ఉండే కొండలనే పర్వతాలుగా నిర్వచించడం సబబుకాదని వ్యాఖ్య
నవంబర్ 20నాటి తీర్పును పక్కనబెడుతున్నామని స్పష్టీకరణ
స్థానిక నిపుణులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది.
సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు.
అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది.
గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది.
రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్‌లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.
ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?
ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్‌లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది.
అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.
స్వాగతించిన పర్యావరణ నిపుణులు
గత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్‌చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్‌ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు.
పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్‌మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.


