అధికారులకు సుప్రీంకోర్టు చురకలు
బకాయిలన్నీ చెల్లించి విధుల్లోకి తీసుకోండి
ఫోర్జరీ పేరుతో కోర్టు అటెండర్ తొలగింపుపై ఆగ్రహం
తెలంగాణ హైకోర్టు తీర్పు కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఒక చిన్న ఉద్యోగిపై అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో విధులకు హాజరు కాని పాపానికి, ఫోర్జరీ ముద్రవేసి ఉద్యోగం నుంచి తొలగించిన కరీంనగర్ కోర్టు అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆరోపణలు తీవ్రమైనవి అయినప్పుడు.. విచారణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలని హితవు పలుకుతూ, సదరు ఉద్యోగిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే?
కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కె.రాజయ్య అనే వ్యక్తి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్నారు. 2017 ఆగస్టులో కడుపునొప్పి, జ్వరం కారణంగా ఆయన 4 రోజులపాటు విధులకు హాజరు కాలేదు. అనధికారికంగా డుమ్మా కొట్టారంటూ అధికారులు మెమో ఇవ్వగా.. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నానంటూ రాజయ్య ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించారు.
అయితే, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్‌కు కోర్టు నోటీసులు పంపగా.. ఆయన మాట మార్చారు. ’ఆ లెటర్ హెడ్ నాదే కానీ, ఆ సర్టిఫికెట్ నేను ఇవ్వలేదు.. ఎవరో నా లెటర్ హెడ్ దొంగిలించి ఫోర్జరీ చేశారు’ అంటూ డాక్టర్ చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. కేవలం ఆ డాక్టర్ మాటలను నమ్మిన విచారణాధికారి.. రాజయ్య ఫోర్జరీ చేశాడని నిర్ధారించారు. ఫలితంగా 2018లో రాజయ్యను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాజయ్య తెలంగాణ హైకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. హైకోర్టు కూడా అధికారుల చర్యను సమర్థించింది.
రబ్బరు స్టాంపే సాక్ష్యం
రాజయ్య అప్పీల్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. రికార్డులను తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించింది. డాక్టర్ కోర్టు నోటీసు తీసుకున్నప్పుడు వేసిన రబ్బరు స్టాంపు, రాజయ్య సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్‌పై ఉన్న రబ్బరు స్టాంపు రెండూ ఒకేలా ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. ఒక ఉద్యోగి జీవితాన్ని నాశనం చేసేంత పెద్ద శిక్ష వేస్తున్నప్పుడు.. కనీసం చేతిరాత నిపుణుడితో ఎందుకు సరిచూడలేదని అధికారులను ప్రశ్నించింది.
కేవలం డాక్టర్ మాట నమ్మి, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఫోర్జరీ అని ఎలా తేలుస్తారని మండిపడింది. రాజయ్యను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని... ఉద్యోగం తొలగించిన నాటి నుంచి నేటి వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలు మూడు వారాల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. అంతేగాక రాజయ్యను ఉద్యోగంలో కొనసాగించాలని స్పష్టంచేసింది.


