న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: ‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ!


