‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ! | UP's Baghpat Khap panchayat sets rules for teenagers | Sakshi
Sakshi News home page

‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ!

Dec 27 2025 2:04 PM | Updated on Dec 27 2025 3:01 PM

UP's Baghpat Khap panchayat sets rules for teenagers

బాఘ్‌పత్‌: ఆధునిక పోకడలతో యువత తప్పుదారి పడుతోందని భావించిన ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌ జిల్లా ‘థాంబా దేశ్ పంచాయతీ’ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో సంప్రదాయ విలువలను కాపాడటంతో పాటు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా టీనేజర్లపై పలు ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది. 18 నుంచి 20 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని,  బహిరంగ ప్రదేశాల్లో హాఫ్ ప్యాంట్లు (షార్ట్స్) ధరించడంపై  నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై సామాజిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

గౌరవ మర్యాదలకు భంగం
ఈ నిర్ణయానికి గల కారణాన్ని పంచాయతీ పెద్దలు వివరిస్తూ.. స్మార్ట్‌ఫోన్ల కారణంగా  పిల్లలు కుటుంబానికి దూరమవుతున్నారని, ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని, అవసరమైతే తప్ప బయటకు తీసుకురావద్దని వారు సూచించారు. పాశ్చాత్య దుస్తులైన హాఫ్ ప్యాంట్లు ధరించడం వల్ల గ్రామీణ ప్రాంత గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, అందుకే యువతీయువకులు సంప్రదాయ దుస్తులనే ధరించాలని తీర్మానించారు. యువత తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో కాకుండా కుటుంబ పెద్దలతో గడుపుతూ విలువలు నేర్చుకోవాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
 

వాట్సాప్ ఆహ్వానాలు చాలు..
వివాహ వేడుకల విషయంలోనూ పంచాయతీ పెద్దలు పలు మార్గదర్శకాలను తెలిపారు. ఆడంబరాలకు పోయి భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేయవద్దని, ఇళ్ల వద్ద నిరాడంబరంగా వివాహాలు జరపాలని కోరారు. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, ఖరీదైన వివాహ పత్రికలకు బదులుగా వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపుకోవాలని సూచించారు. ఈ నిబంధనలపై పంచాయతీ పెద్దలు చౌధరి ఒంపల్ సింగ్, బ్రజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక ఐక్యతను కాపాడేందుకే ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఇవి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావని పేర్కొన్నారు.

అ‍న్ని గ్రామాల్లో అమలు? 
ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాఘ్‌పత్‌ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, యువత మాత్రం ఈ ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నది. డిజిటల్ యుగంలో ఫోన్లపై నిషేధం విధించడం తగినది కాదని కొందరు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఆంక్షలను  అ‍న్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్‌.. 285 మంది అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement