ఒక్క సారి ఊహించండి… మొత్తం కొండ అంతా ఒక్కసారిగా నీలిరంగు సముద్రంలా మారిపోతే ఎలా ఉంటుంది? అది ప్రకృతి సృష్టించిన నిజమైన అద్భుతం. అదే – నీలకురింజి!
మనకు పుష్కరాలు పన్నెండేళ్లకోసారి వస్తాయి కదా… అలానే ఈ నీలకురింజి పూలు కూడా పన్నెండేళ్లకు ఒక్కసారే పూస్తాయి. ఒకేసారి విరబూసి, ఆ తర్వాత మళ్లీ పదేళ్లకు పైగా ఈ పువ్వులు కనిపించవు.
సముద్ర మట్టానికి 1300 నుంచి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు… పూయగానే కొండలన్నీ నీలి-ఊదా రంగులో మునిగిపోతాయి. ఆ దృశ్యం చూడటానికి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి ‘నీలగిరి’ పర్వతాలు అనే పేరు వచ్చిందని ప్రతీతి. అదే నీలగిరి కొండల మధ్యలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. పశ్చిమ కనుమల ఎత్తైన కొండలపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అద్భుతం కనిపిస్తుంది. టొడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు.ఈ తెగల సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈ పూలకు ప్రత్యేక స్థానం ఉంది.
చివరిసారి 2018లో ఈ పూలు పూశాయి. మళ్లీ 2030లో ఈ నీలి పూలతో కొండలు అందంగా కనిపిస్తాయి.ఊటీ, నీలగిరి ప్రాంతాలు మరోసారి నీలి తివాచీ పరచుకున్నట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అక్కడికి వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు అది జీవితంలో ఒకసారి చూసే అద్భుత దృశ్యం అవుతుంది. కానీ… ఈ అందమైన అద్భుతం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. టీ, కాఫీ తోటల విస్తరణ… పెరుగుతున్న పర్యాటకం… అడవుల నాశనం… ఇవన్నీ నీలకురింజి ఆవాసాలను క్రమంగా తగ్గిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబాబుదాన్ గిరి, కుడ్రేముఖ్, నీలగిరి ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని అత్యంత కీలకమైన జాతిగా గుర్తించింది.ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అరుదైన బహుమతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.2030లో ఊటీ నీలగిరి కొండలు మళ్లీ నీలి సముద్రంలా మెరిసే దృశ్యం చూడాలంటే… మనం ఇప్పుడే ప్రకృతిని రక్షించాలి.ఎందుకంటే… నీలకురింజి కేవలం ఒక పువ్వు కాదు… పన్నెండేళ్ల సహనానికి ప్రతీక!


