వెంగల్‌ సీఐ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

వెంగల్‌ సీఐ బాధ్యతల స్వీకరణ

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 2:22 PM

 Murali as Vengal Circle Inspector

వెంగల్‌ సర్కిల్‌ ఇన్పెక్టర్‌గా మురళీ

తిరువళ్లూరు: వెంగల్‌ సర్కిల్‌ ఇన్పెక్టర్‌గా మురళీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్‌ సీఐగా ఉన్న వెంకటేషన్‌ ఇటీవల ఉత్తరమేరూర్‌కు బదిలీ చేశారు. దీంతో చెంగల్‌పట్టు సీఐగా విధులు నిర్వహిస్తున్న మురళిని వెంగల్‌కు బదిలీ చేశారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కాగా నూతన సీఐకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

మసాజ్‌ సెంటర్‌లోకి చొరబడి నగలు చోరీ

అన్నానగర్‌: మసాజ్‌ సెంటర్‌లోకి చొరబడి యువతులను కత్తితో బెదిరించి 10 గ్రాముల బంగారం, సెల్‌ ఫోన్లను దోచుకున్న డ్రగ్స్‌ ముఠాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. చైన్నెలోని వేలచ్చేరి ప్రాంతంలో ఓ ప్రసిద్ధ మసాజ్‌ సెంటర్‌ ఉంది. శనివారం రాత్రి 7.30 గంటలకు ఈ మసాజ్‌ సెంటర్‌ కు ఐదుగురు యువకులు వచ్చారు. వారిలో నలుగురు మసాజ్‌ చేయించుకున్నారు. వారిలో ఒకరు మాత్రమే మద్యం తాగి ఉండటంతో యువతులు అతనికి మసాజ్‌ చేయడానికి నిరాకరించారు. దీని కారణంగా, తాగిన వ్యక్తి మసాజ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న యువతులతో వాగ్వాదానికి దిగాడు. అప్పుడు వెంట వచ్చిన అతని స్నేహితులు మద్యం మత్తులో ఉన్న అతనిని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఊహించని విధంగా మసాజ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా తిరిగి మసాజ్‌ సెంటర్‌ కు వచ్చి, కత్తులతో యువతుల నుంచి 10 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్లు లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి యువతులు వేలచ్చేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాదరసం ఇంజెక్ట్‌ చేసుకొని యువకుడి ఆత్మహత్య

అన్నానగర్‌: విల్లుపురం సమీపంలో యువకుడు తన శరీరంలోకి పాదరసం ఇంజెక్ట్‌ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురంలోని పూంతోట్టం ప్రాంతానికి చెందిన తులసీరామ్‌ (36)కు మధురై కలుపట్టికి చెందిన పాండియమ్మాళ్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇతనికి 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తులసీరామ్‌ బి.ఇ పూర్తి చేసి చైన్నెలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అతను నిరుద్యోగిగా ఉండి ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. దీంతో పాండియమ్మాళ్‌ తన పుట్టింటికి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. తనకు పని లేకపోవడం , భార్య విడిపోవడం వల్ల మనస్థాపం చెందిన తులసీరామ్‌ పాదరసం కొనుగోలు చేసి తన శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకున్నాడు. దీని కారణంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పుదుచ్చేరిలోని జిఫ్‌మర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే చికిత్స ఫలించక ఆదివారం ఉదయం ఆయన మరణించారు. విల్లుపురం నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విల్లుపురంలో విషాదాన్ని నింపింది.

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో రూ.4.15 లక్షల మోసం

– నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు

తిరువొత్తియూరు: ప్రభుత్వ ఉద్యోగం తీసి ఇస్తానని చెప్పి యువకుడి వద్ద రూ.4.15 లక్షలు మోసం చేసిన నకిలీ మహిళా ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. శివగంగై జిల్లా, దేవకోటై చిదంబర నాథపురం మొదటి వీధికి చెందిన రమేష్‌కుమార్‌ (32) ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. ఇతనికి దిండిగల్‌ జిల్లా నత్త దగ్గర వళంపట్టికి చెందిన సుమతి, ముత్తులక్ష్మి(40) ఫేస్‌బుక్‌ ద్వారా పరచయమై, తాను దిండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. ఇంకా, తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, డబ్బులు ఇస్తే ప్రభుత్వ శాఖలో ఇంజినీర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. దీని నమ్మిన రమేష్‌కుమార్‌ 2025 వ సంవత్సరంలో సుమతికి రూ.4.15 లక్షలు డబ్బు, విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చాడు. కానీ సుమతి చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో రమేష్‌కుమార్‌ డబ్బులు తిరిగి అడగగా, సుమతి హత్య బెదిరింపులకు పాల్పడింది. దీనిపై శివగంగై జిల్లా ఎస్పీ కార్యాలయంలో రమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుమతిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు.

పిచ్చికుక్క దాడిలో..–12 మందికి గాయాలు

తిరువొత్తియూరు: చైన్నె మైలాపూర్‌లో ఒకే రోజు పిచ్చికుక్క 12 మందిని కరిచింది. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. చైన్నె మైలాపూర్‌ స్లం క్లియరెన్స్‌ బోర్డు నివాస ప్రాంతంలోని విశాలాక్షి తోటలో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంచారం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో ఓ పిచ్చి కుక్క అకస్మాత్తుగా ప్రజలపై దాడి చేయడం ప్రారంభించింది. ఆ దారిన వెళ్లే వృద్ధులు, మహిళలను గాయపరిచింది. దీంతో 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలోని ప్రభుత్వ , ప్రైవేట్‌ ఆసుపత్రిలలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి కార్పొరేషన్‌ అధికారులు యుద్ద ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement