వివిధ పార్టీల విమర్శలు
వ్యాఖ్యలపై పలువురి ఆగ్రహం
తంజావూరులో ఉద్రిక్తత
పలు చోట్ల డీఎంకే, టీవీకేల
నిరసనలతో ఉత్కంఠ
సాక్షి, చైన్నె: తమిళనాట రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధిని అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై వివిధ పార్టీలు తమదైన శైలిలో స్పందించాయి.
అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర
ఈ అరెస్టుపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలని, మహిళల పై గౌరవంగా ప్రవర్తించాలని తాను చాలాకాలంగా చెపుతున్నట్టు గుర్తు చేశారు. ప్రసంగంపై కేసు నమోదు చేయడం వేరని, అయితే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. టీవీకే ప్రభుత్వం తొందరపడటం వెనుక కేవలం కేసు మాత్రమే కాక రాజకీయ కుట్ర ఉందనే అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేకుండా చేయడానికే ఈ చర్య అని విమర్శిస్తూ, అరెస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సమాధానం ఇవ్వలేక..భయపడి అరెస్టు
డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం విడుదల చేసిన ప్రకటనతో పాటు పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ స్పందిస్తూ, శాసనసభలో కావేరి సమస్య, విద్యుత్ ఛార్జీలు, సభలో తమ ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే సీఎం విజయ్ ప్రభుత్వం ఈ పగటిపూట అరాచకానికి దిగిందన్నారు. హైకోర్టు హెచ్చరికలను కూడా పక్కనపెట్టి పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారని మండి పడ్డారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష నేత పాల్గొనకుండా నిరోధించడానికే ఈ అరెస్ట్ అని మండి పడ్డారు. మాజీ మంత్రి తంగం తెన్నరసు స్పందిస్తూ, విమర్శలను తట్టుకోలేక కేసులతో నోళ్లు మూయించాలనుకోవడం ప్రభుత్వ బలహీనతను, భయాన్నే చూపుతోందన్నారు.
ఈ వేగం ప్రజా సమస్యలపై చూపించండి: పీఎంకే నేత అన్బుమణి రాందాసు స్పందిస్తూ, డీఎంకే, టీవీకే వైఖరిని ఖండించారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలని హితవు పలికారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి తీవ్ర చర్యలు వద్దని హైకోర్టు సూచించినప్పటికీ, ప్రభుత్వం అంత హడావుడిగా ఉదయ నిధిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్టు అని మండి పడ్డారు. ఈ వేగాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చూపించాలని హితవు పలికారు.
అరెస్టు.. రాజకీయ నాగరికతకు విరుద్ధం: డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్ స్పందిస్తూ, బడ్జెట్ సమావేశాల ముందు రోజు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటలకుగానూ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజకీయ నాగరికతకు ఏమాత్రం తగినది కాదన్నారు. అధికారంలో ఉన్నవారు మాట్లాడితే భావప్రకటనా స్వేచ్ఛ, ప్రతిపక్షాలు మాట్లాడితే అరెస్టులా? అని ప్రశ్నించారు. ఇటీవలే రాణిపేటలో విలేకరులపై టీవీకే నిర్వాహకులు దాడి చేసిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు, ప్రతిపక్ష నేతపై మాత్రం వెంటనే స్పందించడం చట్ట సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ స్పందిస్తూ, ప్రతి పక్షాల గొంతును అణచి వేసేందుకు ఈ అరెస్టు అని మండి పడ్డారు. అన్నాడీఎంకే సీనియర్‌నేత కేపి మునుస్వామి స్పందిస్తూ, ద్వంద్వఅర్థాల పదాలను ఉపయోగించ వద్దు అని తాను ఉదయ నిధికి సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై పుదయ తమిళగం నేత కృష్ణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిదనేయమక్కల్ కట్చి నేత జవహిరుల్లా స్పందిస్తూ, కరూర్ ఘటనలో డీఎంకే పాలకులు సంయమనం పాటించారేగానీ, తొందర పడి విజయ్‌ను అరెస్టు చేయలేదన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తెరగాలని హితవు పలికారు.
ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఉదయనిధి స్టాలిన్.. ‘నాలుకను అదుపులో పెట్టుకోవాలి’ అనే తిరుక్కురళ్ సూక్తిని పాటించాలన్నారు. ముఖ్యమంత్రిపై చౌకబారు, అసభ్య పదజాలం వాడటం ఆయన పదవికి ఏమాత్రం తగదని విమర్శించారు. నటి, బిజేపీ నేత కుష్భు స్పందిస్తూ, బహిరంగ వేదికపై నటి త్రిషను అవమానించినందుకు గానూ ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరచడాన్ని ఒక రాజకీయ నాటకంగా మలిచి, మద్దతుదారుల చప్పట్లు, ఈలల కోసం పాకులాడే సంస్కృతికి ఇది అద్దం పడుతోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ మాట్లాడుతూ, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఉదయనిధి అరెస్ట్ గుణపాఠం అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందనడానికి ఇది నిదర్శనం అన్నారు. ఇక, ఉదయ నిధి వ్యాఖ్యలపై టీవీకే మంత్రులు అరుణ్‌రాజ్, రాజ్ మోహన్, కీర్తన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ ఉదయనిధి వ్యాఖ్యలు రాజకీయ నాగరికతకు తగినవి కాదని మండి పడ్డారు. అయితే, అరెస్టును నివారించి ఉండాల్సిందని పేర్కొన్నారు.
తంజావూరులో ఉద్రిక్తత..
ఉదయనిధి స్టాలిన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు తంజావూరు రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా విగ్రహం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యేలు దురై చంద్రశేఖరన్, ఆర్.వైద్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు డి.కె.జి. నీలమేఘం, ఎం.రామచంద్రన్, మేయర్‌అంజుగం భూపతి, సిటీ కార్యదర్శి షణ్ముగసుందరం సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం దిష్టిబొమ్మను తగలేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో మరోవైపు, ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీవీకే మహిళా విభాగం ఆధ్వర్యంలో పనగల్ భవన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో టీవీకే ఎమ్మెల్యే ఆర్.విజయ్ శరవణన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డీఎంకే శ్రేణులు అన్నా విగ్రహం వద్ద ధర్నా చేస్తుండగా, టీవీకే కార్యకర్తలు నినాదాలు చేస్తూ అన్నా విగ్రహం వైపు దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునేందుకు యత్నించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుస్తూ, చెప్పులు , రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, తోపులాట చోటుచేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం తర్వాత తంజావూరులో మరింత ఉద్రిక్తత నెలకొనకుండా ముందు జాగ్రత్తగా ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల డీఎంకే వర్గాలు ఓ వైపు, టీవీకే వర్గాలు మరో వైపు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్రంలో మంగళవారం కొనసాగింది.
డీఎంకేలో ఆక్రోశం


