సాక్షి, చైన్నె: సీఎం జోసెఫ్ విజయ్ అధ్యక్షతన ఆదిద్రావిడ , గిరిజన అభివృద్ధి కార్యాచరణ రాష్ట్ర మండలి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఆదిద్రావిడ, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు సంపూర్ణంగా వారికి చేరువయ్యేలా చూసేందుకు తమిళనాడు ప్రభుత్వం అభివృద్ధి కార్యాచరణ చటాన్ని రూపొందించింది. ఈ నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రాష్ట్ర మండలి ఏర్పాటైంది. టీవీకే ప్రభుత్వం ఏర్పడినానంతరం తొలి సమావేశం సీఎం విజయ్ నేతృత్వంలో నిర్వహించారు. ఇది వరకు తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన ఆదిద్రావిడ సంక్షేమానికి రూ. 5,903 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 349 కోట్లు ఖర్చు, నిధుల వినియోగం, లబ్ధిదారుల వివరాలౖ గురించి ఇందులో చర్చించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికకు ఈ సమావేశంలో మండలి ఆమోదం తెలిపింది. కేటాయించిన నిధులు పూర్తిగా ఆయా వర్గాల సంక్షేమానికే ఉపయోగపడాలని, పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి విజయ్ అధికారులను ఆదేశించారు. ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అన్ని శాఖలు తమ నెలవారీ ఖర్చులు, పనుల పురోగతి నివేదికలు, లబ్ధిదారుల వివరాలను నిరంతరం డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ పోర్టల్‌వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.
రూ. 113 కోట్లతో కొట్లతో ఆస్పత్రి భవనాలు
తమిళనాడులో ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వైద్య, నివారణ ఆరోగ్య సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో రూ.113 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ ఆసుపత్రి భవనాలు, ఆధునిక వైద్య పరికరాల వినియోగాన్ని సీఎం విజయ్ విజయ్ మంగళవారం సచివాలయం నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జునా, డాక్టర్ అరుణ్ రాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయికుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.525 కోట్లతోగృహ సముదాయాలు
తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.525 కోట్ల వ్యయంతో నిర్మించిన 4,260 నూతన అపార్ట్‌మెంట్ గృహ సముదాయాలను సీఎం విజయ్ ప్రారంభించారు. అలాగే చైన్నె పెరంబూరులో సీఎండిఏ ఆధ్వర్యంలో రూ.1.43 కోట్లతో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కాలేజ్ ఏసీ బస్టాప్‌ను కూడా ప్రారంభించారు. అలాగే తమిళనాడు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు , తిరువళ్లువర్ విశ్వవిద్యాలయంలో రూ.274.46 కోట్ల వ్యయంతో నిర్మించిన 51 కొత్త భవనాలను కూడా సీఎం విజయ్ ప్రారంభించారు.


