సాక్షి, చైన్నె : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆయనకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రంగసామి పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా రంగసామికి ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం విజయ్ ఫోన్ సంభాషణలో భాగంగా శుభాకాంక్షలు తెలుపగా, పుదుచ్చేరి సీఎం రంగసామి స్పందిస్తూ ధన్యవాదాలు, పనులన్నీ బాగా సాగుతున్నాయా? అని వాకబు చేయడం గమనార్హం. అలాగే, చాలా మంచిది, బాగా పనిచేయండి. త్వరలోనే నేరుగా వచ్చి కలుస్తాననని పేర్కొన్నారు. కాగా, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి , విజయ్‌కి మధ్య మొదటినుంచీ మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. విజయ్ గతంలో తన రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సమయంలో కూడా రంగస్వామి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో ఉన్నప్పటికీ, విజయ్‌తో రంగ స్వామి మధ్య స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక, రంగస్వామి జన్మదినాన్ని ఆ పార్టీ వర్గాలు కోలాహలంగా మంగళవారం జరుపుకున్నారు. సేవలు హోరెత్తించారు. అతి పెద్ద కేక్‌కు రంగస్వామి కట్ చేసి అందరికి పంచి పెట్టారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభం
కొరుక్కుపేట: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కోసం అఖిల భారత కౌన్సెలింగ్ ఆనన్‌లైనన్‌లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లోని 15 శాతం సీట్లు అఖిల భారత రిజర్వేషన్ కోటా కింద కేటాయించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలోని మెడికల్ అడ్మిషనన్స్ కమిటీ, ఈ సీట్ల కోసం ఎయిమ్స్, జిప్‌మెర్, గుర్తింపు పొందిన దంత కళాశాలలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎంబీబీఎస్, బిడిఎస్ సీట్ల కోసం ఆనన్‌లైన్ ప్రవేశాలను నిర్వహిస్తుంది. దీనికి అనుగుణంగా, ఈ ఏడాది కౌన్సెలింగ్ మంగళవారం ఆనన్‌లైనన్‌లో ప్రారంభమైంది. అఖిల భారత కౌన్సెలింగ్ మొదటి రౌండ్ మంగళవారం నుండి 17వ తేదీ వరకు httpr://mcc.nic.in/ వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంది. దాని తర్వాత, రెండవ రౌండ్... వైద్య సలహా సమీక్షా కమిటీ ప్రకటించిన దాని ప్రకారం, రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 24వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు, , మూడవ విడత సెప్టెంబర్ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన విద్యార్థులు తమ నీట్ ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ, ప్రాధాన్యత ఆధారంగా కళాశాలలను ఎంచుకుని, ఒక ప్రాధాన్యతా జాబితాను సమర్పించాలి. కౌన్సెలింగ్ సమయంలో, విద్యార్థులు ముందుగా తమకు నచ్చిన వైద్య కళాశాలలు కోర్సుల కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత, విద్యార్థి ర్యాంక్, కోటా నిబంధనలు, ఖాళీలు, ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.అంతేకాకుండా, తమిళనాడులో రాష్ట్ర కోటా సీట్ల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనుందని అధికారులు వెల్లడించారు.
తిరుచ్చి సమీపంలో
రోడ్డు ప్రమాదం
సాక్షి, చైన్నె : తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం వేకువ జామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు సహా ముగ్గురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పుదుక్కోటై జిల్లా కరంబక్కుడి తాలూకా కొట్టైకాడుకు చెందిన పాండియన్ (49), ధనలక్ష్మి (47), వారి కుమారుడు భావిన్ (9), బంధువులు కౌసల్య (46), వలర్మతి (45), తిల్లైయమ్మాళ్ (48), గోకులవాణి (13), మణిశర్మ (16), తిరునావుక్కరసు (52) లతో కూడిన బృందం తంజావూరు బిగ్ టెంపుల్, సమయపురం మరియమ్మన్ ఆలయ దర్శనం కోసం కారులో బయలుదేరారు. తంజావూరు ఆలయ దర్శనం ముగించుకుని, సోమవారం రాత్రి సమయపురం వైపు వెళ్తుండగా మంగళవారం వేకువ జామున 2 గంటల ప్రాంతంలో పల్లివిడై వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా, తిరుచ్చి నుంచి చైన్నె వెళ్తున్న ఓమ్ని బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారు శిథిలాల్లో చిక్కుకున్న 10 మందిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన పాండియన్, ధనలక్ష్మి,భావిన్‌లను శ్రీరంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. మిగిలిన ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.


