టీవీకేలో చేరుతారా? లేక రాజకీయాలకు విరామమా? | AIADMK Vijayabaskar Holds Emergency Meeting Amid Political Uncertainty, Seeks Public Opinion On Future Move | Sakshi
Sakshi News home page

టీవీకేలో చేరుతారా? లేక రాజకీయాలకు విరామమా?

May 29 2026 10:47 AM | Updated on May 29 2026 11:08 AM

AIADMK Vijayabaskar says he will announce his  political move soon

సాక్షి, చెన్నై: ప్రస్తుత రాజకీయ పరిణామాలు? మనం ఏం చేయాలి? అనే విషయాలపై తనకు ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, భావాలను అడిగి తెలుసుకుంటున్నానని అన్నాడీఎంకే సీనియర్‌ నేత సీ విజయ భాస్కర్‌ ప్రకటించారు. వారి నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయ భవిష్యత్తుపై తన తదుపరి అడుగు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల  నేపథ్యంలో పుదుక్కోట్టై జిల్లా విరాలిమలైలోని తన నివాసంలో విజయభాస్కర్‌ గురువారం తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 

పళనిస్వామితో రాజీపై అసంతృప్తి? 
పార్టీ మరింత బలహీనపడకుండా చూసేందుకు బుధవారం తిరుగుబాటు వర్గానికి చెందిన కీలక నేతలు ఎస్‌.పి. వేలుమణి నేతృత్వంలో పలువురు నేతలు చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి నివాసానికి వెళ్లి రాయబార చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఇరు వర్గాలు సచివాలయానికి వెళ్లి, పరస్పరం ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత వేటు లేఖలను ఉపసంహరించుకున్నారు. అలాగే అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని, విప్‌గా అగ్రి కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్లు స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌కు లేఖలు అందించారు.అయితే, ఈ రాజీ ప్రక్రియలో సి.వి. షణ్ముగం పాల్గొనలేదు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు , మద్దతు దారులతో మంతనాలలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. 

ఈ సమయంలో  సి. విజయభాస్కర్‌ స్పీకర్‌ను కలవడానికి వచ్చినప్పటికీ, పళనిస్వామిని వ్యక్తిగతంగా కలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అనుచరుల ముందు 3 ప్రత్యామ్నాయాలు 
ఈ నేపథ్యంలోనే విజయభాస్కర్‌ విరాలిమలైలో తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యంగా మూడు ప్రతిపాదనలను అనుచరుల ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం  అన్నాడీఎంకేలో   కొనసాగాలా? లేదా, విజయ్‌ నేతృత్వంలోని టీవీకేలో చేరాలా? లేదా ప్రస్తుతానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలా? అన్న మూడు అంశాల ఆధారంగా ఈ మంతనాలు జరుగుతుండటం గమనార్హం. 

ప్రజల తీర్పు ప్రకారమే నిర్ణయం 
సమావేశం అనంతరం విజయభాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తన తదుపరి అడుగు ఎలా ఉండాలనే దానిపై  విజయానికి శ్రమించిన పార్టీ నిర్వాహకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నానని తెలిపారు. తనను  గెలిపించిన దేవుళ్లు అయిన నియోజకవర్గ ప్రజల మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే  తదుపరి రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement