సాక్షి, చెన్నై: ప్రస్తుతం ఏ నోట చూసినా తమిళనాడు రాజకీయాల చర్చే.. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనేదే ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న.. తంబీల రాజకీయాలు ఇంత వేడిగా ఉన్న సమయంలో ఇప్పుడు మరోక ఆసక్తికర ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్యా వీసీకే చీఫ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వేళ వీసీకే ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్ సంచలన ప్రతిపాదన తెరమీదకి తెచ్చారు." ప్రస్తుత అనిశ్చిత రాజకీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్ పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలి" అని ఇరు పార్టీలను ఎక్స్ వేదికగా కోరారు.
కేవలం అభిమానుల బలంపై ఆధారపడిన పాపులరిజం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సెల్వన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అనుభవం ఉన్న, అవినీతి మరక లేని తిరుమావళవన్ వంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజకీయ స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ప్రజల్లో ఉన్న బలమైన భావన అని పేర్కొన్నారు.
ఒకవేళ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే, అది కొత్తగా వచ్చిన తారల ద్వారా కాకుండా, ప్రజల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న తిరుమావళవన్ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు.కాగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సినీ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీకి మరో 10 సీట్ల దూరంలో ఆయన నిలిచిపోయారు.
దీంతో మిగతా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వీసీకే పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీకి ఎన్నికల్లో 2 స్థానాలు వచ్చాయి.


