చెన్నై: విక్రమార్కుడు సినిమాలో రవితేజ డబ్బుల ఆశ చూపించి, చాలా మంది మహిళలకు గుండ్లు చేయిస్తాడు. తమిళనాడులోనూ ఇలాగే ఓ వ్యక్తి మహిళలకు గుండ్లు చేయించాడు. గుండ్లు చేయించుకుంటే డబ్బులు వస్తాయని ఆశపడ్డ మహిళలు చివరకు మోసపోయామని గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు.
సేలం జిల్లాలో మహిళలకు మాయమాటలు చెబుతూ వారికి గుండు చేయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తి అరియలూరు జిల్లాకు చెందిన ఎం.సతీశ్ కుమార్ (39).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ కుమార్ తనను అట్టూరు తాలూకా తహసీల్దార్‌గా పరిచయం చేసుకుంటూ మహిళలకు ఫోన్ చేసేవాడు. జుట్టు ద్వారా "ఒమెగా ఇన్‌ఫెక్షన్" అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోందని, కరోనా మాదిరిగా ప్రమాదకరమని చెప్పి భయపెట్టేవాడు. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే గుండు చేయించుకోవాలని నమ్మించేవాడు.
అంతేకాకుండా, గుండు చేయించుకున్న వారికి తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతులు ఇస్తోందని చెప్పాడు. మహిళలకు రూ.15,000, విద్యార్థులకు రూ.45,000, పురుషులకు రూ.6,000 ఇస్తారని తెలిపాడు.
తన మాటలను నమ్మించే ప్రయత్నంలో, గుండు చేయించుకున్నవారికి డబ్బులు ఇస్తున్నట్టు కనిపించే ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపించాడు. వాటిని చూసి నమ్మిన రామాయి (58), చిత్ర (63), కావేరి (64) గుండు చేయించుకున్నారు.
తర్వాత డబ్బుల కోసం అతడిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు గుర్తించారు. దీంతో రామాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో సతీశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలు గుండు చేయించుకున్న వీడియోలు చూసి, నిజ జీవితంలో కూడా అలాంటి ఘటన చూడాలనే ఉద్దేశంతో ఈ మోసానికి పాల్పడినట్టు అతడు పోలీసులకు చెప్పాడు.
మహిళలపై హింస నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం అతడు సేలం కేంద్ర కారాగారంలో ఉన్నాడు.


