చలికాలంలో మనమంతా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు స్వెట్లర్లు, హీటర్లు లాంటివాటిని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కలు చలికాలంలో వెచ్చిదనం కోసం ఏం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బయట భారీగా మంచు కురుస్తూ, చలి గాలి వణికిస్తున్న సమయంలో కొన్ని మొక్కలు తమ లోపల 35° సెంటీగ్రేడ్ వరకు వేడిని పుట్టించుకుంటాయి. ఇదే మాదిరిగా ఒక పుష్పం చలి కాలంలో రాత్రి వేళ కీటకాలకు వెచ్చని ‘లగ్జరీ రూమ్’లా మారుతుంది. కమల పుష్పం మొదలుకొని ‘డెడ్ హార్స్ లిల్లీ’ వరకు.. ఇవన్నీ తమ గర్భంలో అద్భుతమైన ‘థర్మోజెనిసిస్’ రహస్యాలను దాచుకున్నాయి. దీనిపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైన వివరాలు శాస్త్రవేత్తలను సైతం తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి.
థర్మోజెనిసిస్ అంటే..
శీతాకాలంలో పక్షులు, జంతువులు చలిని తట్టుకునేందుకు ప్రకృతి వాటికి అనువైన శరీర ఆకృతిని ఇచ్చిందని మనం ఎక్కడో చదివేవుంటాం. అయితే మొక్కలు కూడా తమ శరీర ఉష్ణోగ్రతను పెంచుకోగలవు అనే విషయం మీకు తెలుసా? దీనిని ‘థర్మోజెనిసిస్’ అంటారు. కణాలలోని మైటోకాండ్రియా ఆహారాన్ని ఏటీపీగా మార్చే క్రమంలో కొంత శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. అయితే ‘ఆల్టర్నేటివ్ ఆక్సిడేస్’ అనే ఎంజైమ్ సాయంతో కొన్ని ప్రత్యేక మొక్కలు చక్కెరల నుండి నేరుగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఉత్తర, మధ్య భారతదేశపు సరస్సుల్లో పెరిగే కమల పుష్పం ఇందుకు ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది.
బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా..
వేసవి కాలం ప్రారంభంలో వికసించే కమలం మూడు, నాలుగు రోజుల పాటు వికసించి ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 10°C కి పడిపోయినా, దాని లోపల మాత్రం 30-35°C వేడి నిరంతరం కొనసాగుతుంది. పుష్పం రేకుల కొనలు పింక్ రంగులోకి మారినప్పుడు ఈ వేడి పుట్టడం మొదలవుతుంది. ఈ ఉష్ణోగ్రత ఆ పుష్పం నుంచి సుగంధం వెదజల్లడానికి తోడ్పడుతుంది. దీనివల్ల కీటకాలు ఆకర్షితమై, పరాగసంపర్కం సులభతరం అవుతుంది.
కీటకాలకు వెచ్చని గదిలా..
కమలంలోని మధ్య భాగంలో పిస్టిల్స్ తొలుత పరిపక్వం చెందుతాయి. పుష్టంలోని వేడికి ఆకర్షితమైన తేనెటీగలు, తుమ్మెదలు దాని లోపలికి చేరుకుంటాయి. మధ్యాహ్నం వేళ పుష్పం రేకులు మూసుకుపోతాయి. కీటకాలకు రాత్రి పూట ఒక వెచ్చని గదిలా రక్షణ కల్పిస్తాయి. మరుసటి రోజు ఉదయం పువ్వు వికసించే సమయానికి పుప్పొడి సిద్ధమవుతుంది. కీటకాలు ఈ పుప్పొడిని అద్దుకుని వేరే మొక్కలకు వెళ్లడం ద్వారా ‘క్రాస్ పాలినేషన్’ జరుగుతుంది. ఇది మొక్కల జన్యు వైవిధ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కాల్షియం అయాన్ల మ్యాజిక్
మొక్కలో ఇలా ఉష్ణోగ్రత పెరగడానికి కాల్షియం అయాన్లు ఒక ‘ఆన్ స్విచ్’లా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. వేడి సమయంలో కణాలలోని కాల్షియం స్థాయి నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది మైటోకాండ్రియాను వేగంగా పనిచేయమని సిగ్నల్ ఇస్తుంది. ఈ ప్రక్రియలో మొక్కలో నిల్వ ఉన్న స్టార్చ్, కొవ్వు పదార్థాలు పెద్ద మొత్తంలో వినియోగమై, వేడిని ఉత్పత్తి చేస్తాయి. పుష్పంలోని ఇతర భాగాల కంటే పిస్టిల్స్ ఉన్న పైభాగం 4-5°C ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది.
మంచును సైతం కరిగిస్తూ..
ఉత్తర అమెరికాలో పెరిగే ‘ఈస్టర్న్ స్కంక్ క్యాబేజీ’ మరో అడుగు ముందుకేసి, మంచును సైతం కరిగించేస్తుంది. వసంతకాలం ఆరంభంలో ఇది మంచు పొరలను చీల్చుకుని పైకి రావడానికి వేడిని పుట్టిస్తుంది. దీని నుండి వచ్చే గాఢమైన వాసన వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బీటిల్ పురుగులు మంచు కురిసే సమయంలో ఈ పువ్వు ఇచ్చే వెచ్చదనం కోసం చేరుకుంటాయి.
కుళ్లిన వాసనతో ఆకట్టుకుంటూ..
సార్డీనియాలో కనిపించే ‘డెడ్ హార్స్ ఏరమ్ లిల్లీ’ కథ మరింత విభిన్నం. ఇది వేడిని ఉపయోగించి ఒక రకమైన కుళ్లిన వాసనను (డైమిథైల్ డైసల్ఫైడ్) విరజిమ్ముతుంది. ఇది కుళ్లిన మాంసం వాసనను పోలి ఉంటుంది. మాంసం కోసం వెతికే ‘బ్లోఫ్లైస్’ ఈ వాసనకు ఆకర్షితమై తండోపతండాలుగా వస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో భాగమైన మొక్కలు తమ మనుగడ కోసం, పరాగసంపర్కం కోసం ఉష్ణోగ్రతను ఒక ఆయుధంగా వాడుకోవడం నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్


