ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2024 ఆగస్టులో విద్యార్థుల సారధ్యంలో జరిగిన హింసాత్మక ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఈ ఎన్నికల్లో అత్యధికంగా 288 మంది అభ్యర్థులను బరిలోకి దించి, సత్తా చాటాలని నిర్ణయించింది. ఇతర ప్రధాన పార్టీలైన జమాత్-ఎ-ఇస్లామీ 224 మందిని, జాతీయ పార్టీ 192 మందిని, ఇస్లామిక్ ఆందోళన్ బంగ్లాదేశ్ పార్టీ 253 మందిని పోటీకి నిలిపాయి. మరోవైపు 249 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జమాత్-ఎ-ఇస్లామీతో పొత్తు పెట్టుకున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ)32 మంది అభ్యర్థులను ప్రకటించింది.
జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 ఉదయం 7:30 గంటల వరకు ప్రచారం కొనసాగుతుందని, ఫిబ్రవరి 12న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 లక్షల మందికి పైగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎన్నికల శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్ ముహమ్మద్ హసనుజ్జమాన్ వెల్లడించారు.
ఎన్నికల తేదీపై వస్తున్న వదంతులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఖండించారు. అమెరికా మాజీ దౌత్యవేత్తలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 12నే జరుగుతాయి.. ఒక్క రోజు ముందు కాదు, వెనుక కాదని స్పష్టం చేశారు. ఎన్నికల చుట్టూ గందరగోళం సృష్టించేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


