సెంట్ ఎల్లో పూల సాగు వైపు రైతన్నల చూపు
పగటి ఉష్ణోగ్రతే రాత్రుల్లో ఉండేలా ప్లాన్
వేసవిలో క్రాప్ వస్తే పూల ధరలు ఆశాజనకం
రాత్రుల్లో పంటపై మెరుస్తున్న కృత్రిమ వెలుగులు
వ్యవసాయంలో రైతులు ఆధునిక మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త పద్ధతులతో పంటలను సాగు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఆన్ సీజన్‌లో(ఆఫ్ సీజన్) పంటలు సాగుచేస్తే ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. చలికాలంలో చామంతి పూలను ఎల్‌ఈడీ లైట్ల ద్వారా సాగుచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దీని ద్వారా చామంతి సాగులో అక్కడి రైతులు మంచి ఫలితాలను సాధించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు.
పలమనేరు: సాధారణంగా చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం ప్రాంతాలు శీతల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ వేసవిలోనూ మంచు కురవడం సర్వసాధారణం. మామూలుగా చామంతి పూల సీజన్ మేలో మొదలై డిసెంబర్ కల్లా ముగుస్తుంది. ఆపై శీతల వాతావరణం కారణంగా ఆఫ్ సీజన్ కావడంతో మొగ్గరాక పంట సాగు కష్టంగా మారుతుంది. అయితే అన్ సీజన్ అయిన వేసవిలో చామంతికి భారీ డిమాండ్ ఉంటుంది. దీన్ని పసిగట్టిన కొందరు కర్ణాటక రైతులు పగటిపూట ఉండే ఉష్ణోగ్రతలే రాత్రుల్లో ఉండేలా తోటల్లో ఎల్‌ఈడీ బల్బులను అమర్చి మంచి దిగుబడులను సాధించారు. ఆ మేరకు జనవరిలో చామంతిని సాగుచేస్తే మూడు నెలల్లో ఏప్రిల్, మే, జూన్ దాకా దిగుబడి వస్తుంది. చామంతి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అందుకే రైతులు ఈ కొత్త పద్ధతితో సాగుచేస్తున్నారు.
తేడా ఏంటంటే?
సాధరణ సీజన్‌లో చామంతిని సాగుచేస్తే ఎకరానికి రూ.2 లక్షల ఖర్చవుతుంది. నాలుగు టన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. కిలో సగటున రూ.100 పలికినా నాలుగు టన్నులకు రూ.4 లక్షలు దాకా వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ.2 లక్షలుపోగా రూ.2లక్షల నికర లాభం ఉంటుంది. అదే ఎల్‌ఈడీ పద్ధతిలో ఎకరానికి పంట పెట్టుబడి రూ.5 లక్షలుగా ఉంటుంది. పంట దిగుబడి 7 టన్నులకు పైగా వస్తుంది. అన్ సీజన్‌లో ధరలు కిలో రూ.200 నుంచి రూ.250 దాకా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో రూ.14 నుంచి రూ.16 లక్షల దాకా రాగా ఇందులో పంట పెట్టుబడి రూ.5 లక్షలు పోగా రూ.9 లక్షల దాకా నికర లాభాలుంటాయి. అందుకే రైతులు పెట్టుబడి ఎక్కువైనా ఎల్‌ఈడీ సిస్టమ్ వైపు ఆసక్తిని చూపుతున్నారు.
ఎకరాకు రూ.60 వేల ఖర్చు
ఎకరా పొలంలో చామంతి పంటకు 250 ఎల్‌ఈడీ లైట్లు, హోల్డర్లు, 260 మీటర్ల సిల్కువైరు, వెయ్యి మీటర్ల సర్వీసు వైరు, 250 ఉడెన్‌ఫోల్స్(నిలువు కర్రలు), ప్రత్యేకంగా విద్యుత్ సరీ్వసు, వీటి ఏర్పాటుకు కూలీలతో కలిపి ఖర్చు రూ.60 వేల దాకా అవుతోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు.
మంచి మార్కెట్ సదుపాయం
ఈ ప్రాంతంలో పండిస్తున్న సెంట్ ఎల్లో చామంతి క్వాలిటీ బాగుంటుంది. బెంగళూరు మార్కెట్‌లో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడికి బెంగళూరు వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణాకు సౌకర్యంగా ఉంది. అన్‌సీజన్ అయిన వేసవిలో చామంతి పూలు రావడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. మంచి ధరలు పలికేందుకు అస్కారముంటుంది. ముఖ్యంగా వేసవిలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల డెకరేషన్లకు ఇవే ట్రెండ్‌గా మారాయి. ఔత్సాహిక రైతులు ఎల్‌ఈడీ సేద్యంపై మక్కువ చూపుతున్నారు.
ఎక్కువగా సెంట్ ఎల్లో సాగు!
ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు కలకత్తా నుంచి అందిన సెంట్ ఎల్లో సీడ్‌ను నాటారు. ఇది మూడు నెలల్లో పూల దిగుబడి మొదలై నాలుగు నెలల పాటు కోతలుంటాయి. నాటాక మొక్కలు పెద్దవయ్యే దాకా దాదాపు 40 రోజులపాటు ఎల్‌ఈడీ బల్బులను తోటలో ఏర్పాటు చేయాలి. లేదంటే ఇవి మొక్క దశలోనే చనిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20 ఎకరాల్లో ఐదుగురు రైతులు ఎల్‌ఈడీ ద్వారా చామంతి పూలను సాగుచేస్తున్నారు. బైరెడ్డిపల్లి సమీపంలోని జాలారిపల్లి రోడ్డు వద్ద కర్ణాటకకు చెందిన రైతులు ద్వారా శంకరప్ప అనే రైతు ఎల్‌ఈడీ విధానం ద్వారా ఇటీవలే చామంతిని సాగుచేశారు.
ఆఫ్ సీజన్‌లో పంటను తెప్పించే పద్ధతిది
సాధారణంగా మామిడి కాయలు ఆ సీజన్‌లో వస్తాయి. కానీ వీటిని ఆఫ్ సీజన్‌లో పండిస్తే ఎంతటి గిరాకీ ఉంటుందో అదే విధంగా వేసవిలోనూ చామంతి పూలు రావాలంటే శీతల కాలంలో రాత్రుల్లో పగటి ఉష్ణోగ్రతలను ఎల్‌ఈడీ బల్బుల ద్వారా కల్పించే కృత్రిమ పద్ధతిది. దీంతో నాణ్యమైన పూలు, ఆశించిన దిగుబడి, ధరలుంటాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఎల్‌ఈడీ సాగు మొదలవుతోంది. రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంట సాగుపై మక్కువ చూపడం మంచి పరిణామం. – డా.కోటేశ్వరావు, సైంటిస్ట్, సెంటర్‌ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్, కుప్పం


