చిత్తూరు రూరల్ (కాణిపాకం): వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పెరగడం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 47 గ్యాస్ ఏజెన్సీలుండగా...6 లక్షల వరకు వంట గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 3.2 లక్షల సిలిండర్లు అమ్ముడుబోతున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.883 ఉండగా తాజా పెంపుతో అది రూ.943కు చేరింది. నెలకు ఒకటి లేదా రెండు సిలిండర్లు వినియోగించే కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది. ఇప్పటికే పప్పు, నూనె, గోధుమపిండి, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
మరింత భారమే
గత కొంతకాలంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలు కూడా పెరగడంతో సాధారణ కుటుంబాలు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడుతున్నాయి.
కొత్త నిబంధనలతో మరిన్ని తిప్పలు
ధరల పెంపుతో పాటు ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి. ఒకే సిలిండర్ ఉన్న వినియోగదారులు 25 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునేలా, రెండు సిలిండర్లు ఉన్నవారు 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునేలా పరిమితులు విధించాయి. ఈ నిబంధన వల్ల అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్ పొందడం కష్టమవుతోంది.
మళ్లీ పొగబెట్టే పరిస్థితి
పదేళ్ల క్రితం వరకు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వంట గ్యాస్ వినియోగం చాలా తక్కువగా ఉండేది. అడవుల్లో దొరికే కలపతో వంట చేసేవారు. దీంతో పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం ఏర్పడేది. ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వాలు గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించాయి. దీపం, ఉజ్వల వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. అయితే ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగడంతో చాలా కుటుంబాలు సిలిండర్ వినియోగాన్ని తగ్గించే పరిస్థితి ఏర్పడింది.
భారం వద్దు
నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయి. నెలకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చువుతోంది. దీంతో పాటు గ్యాస్ ధరలు పెరిగాయి. ఇది సామాన్య జనానికి ఇబ్బందికరమే. గ్యాస్ రాయితీలు ఇస్తామన్నారు. అది కూడా సక్రమంగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
– గోవిందమ్మ, ఎస్‌ఆర్‌పురం మండలం


