లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం | Congress moves no-confidence motion against Om Birla | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

Feb 10 2026 1:24 PM | Updated on Feb 10 2026 2:49 PM

Congress moves no-confidence motion against Om Birla

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ  మంగళవారం నోటీసు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గగోయ్ వెల్లడించారు. ఇందుకోసం  వందమందికి పైగా ఎంపీల సంతకాలను కాంగ్రెస్‌ సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్  ఆరోపించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని పై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మొత్తం 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం, స్పీకర్‌ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాల నేపథ్యంలో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు.  కాగా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్‌కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు సూచించినప్పటికీ, చివరికి అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు.

లోక్ సభలో యుద్ధం మొదలు 100 ఎంపీలతో కాంగ్రెస్ సిద్ధం

Advertisement
 
Advertisement
Advertisement