సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఆలయ ప్రతిష్టను దిగజార్చారు
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఏడాది క్రితం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ తప్పని తేల్చడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పును చేశామని అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. అబద్ధాన్ని నిజం చేయడమే లక్ష్యంగా మరిన్ని తప్పులు చేస్తున్నారు.
ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నితమైన అంశాన్ని పట్టుకుని వికృత రాజకీయాలకు తెరదీయడం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో కట్టు కథలు ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని మొన్నటిదాకా ప్రచారం చేసిన కూటమి నాయకులు.. కొత్తగా పామాయిల్, బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిశాయంటూ తిమ్మిని బమ్మిని చేసే కుట్రకు తెరదీశారు.
బాబూ.. వీటికి సమాధానం చెప్పు
వాస్తవానికి తాను చేసిన ఆరోపణలన్నింటికీ తానే సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు.. ఆ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీకి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిల్స్ తోనే ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ఐ పరీక్షలు జరిపింది. ఆ నెయ్యి లోనే పామాయిల్, బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అండ్ కో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకో కల్పిత కథనాలు రాసి ప్రజలను అయోమయానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా కల్తీ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ రిజెక్టు చేసి వెనక్కి తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లనే దొడ్డి దారిన తెప్పించి లడ్డూ తయారీకి వాడారు. దీనికి సీఎంగా ఉన్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందిపోయి దొంగే దొంగ అన్నట్టుగా ఆయనే తిరుమలపై తప్పుడు ప్రచారం ఊపందించాడు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటు. సీబీఐ చార్జిషీట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు 2014-19 వరకు రూ. 273.90 లకు తిరుమలకు నెయ్యిని సరఫరా చేసింది. వాస్తవం ఇలా ఉంటే నువ్వుల నూనె కన్నా తక్కువ ధరకు నెయ్యి ఎలా సప్లై చేస్తున్నారని వారే ప్రశ్నిస్తారు.

నేరం చేసినట్టు సీబీఐ చార్జిషీట్లో పొందుపరిచిన బోలేబాబా డెయిరీకి కూడా చంద్రబాబు సీఎంగా ఉండగానే టీటీడీకి అనుమతి లభించింది. మార్చి 6, ఏప్రిల్ 19, 2019న 82 వేల కేజీలు ఒకసారి, 12 వేల కేజీలు ఇంకోసారి నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేసే బల్క్ ఆర్డర్ ఇవ్వడంపైన సీబీఐ సిట్ అనుమానం వ్యక్తం చేసింది. పైగా ఆ ఆర్డర్ కేజీ విలువ రూ.291 మాత్రమే కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకి లేదా? బోలేబాబా డెయిరీకి 82 వేల కేజీల నెయ్యిని రూ.291లకు ఆర్డర్ ఇవ్వలేదని, టీటీడీ రిజెక్టు చేసి పంపిన నెయ్యిని అడ్డదారిలో తెచ్చి వాడలేదని చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగలరా? 2015లో టీటీడీకి నెయ్యిని సప్లై చేస్తున్న నందిని డెయిరీ పేరుతో విజయవాడలో డూప్లికేట్ నెయ్యి తయారు చేసి 12 ట్యాంకర్లు సప్లై చేస్తే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ చేసిన విషయం నిజమా కాదా? ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు ఏం సమాధానం చెబుతారు?
హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్
అధికారంలో ఉన్న చంద్రబాబు తన వద్ద ఉన్న వ్యవస్థలతో విచారణ జరిపించి ఎవరైనా తప్పు చేసి ఉంటే న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చేయకుండా రోడ్డెక్కి తప్పు ప్రచారం చేయడం, తనకు అనుకూల పత్రికలు, టీవీలలో ఊదరగొట్టడం, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రికల ద్వారా తిరుమల ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారు?
చంద్రబాబు చేసిన మహాపచారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుందనే భయంతో పాపాన్ని జనసేన, బీజేపీకి అంటించడానికే ప్రెస్‌మీట్ పెట్టించాడు. కానీ అక్కడ కూర్చున్న వారందరిలోనూ తప్పు చేశామన్న భావన కనిపిస్తోంది. దేవుడితో ఆటలాడుకుంటున్నామన్న అపరాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపతులు, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చంద్రబాబు మోసాలను ఇకనైనా గుర్తించి ఆయన్ను ప్రశ్నించాలి. తన అసమర్థ పాలన నుంచి ఎన్నికల హామీలు అమలు చేయలేని చేతకాని తనం నుంచి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్న చంద్రబాబుని నిలదీయాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించకుండా అబద్దాలు, మోసాలతో మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి.


