న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు.
‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!


