లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.
ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపధ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. లక్నో పరిధిలోని మలిహాబాద్, మోహన్‌లాల్‌గంజ్ తదితర నియోజకవర్గాల్లో 83 శాతం మంది దరఖాస్తులు సమర్పించగా, లక్నో కంటోన్మెంట్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల సంఘం తగిన సమయాన్ని కేటాయించింది.
ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 31న ప్రకటించనున్న ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 2026, జనవరి 30లోపు ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. తుది ఓటర్ల జాబితాను 2026, ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ భారీ మార్పులు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి: మక్కాలో కలకలం.. వీడియో వైరల్


