మక్కా: ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కాలో కలకలం చెలరేగింది. మసీదు అల్-హరమ్ (గ్రాండ్ మసీదు)లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్‌నకు గురిచేసింది. మసీదు పైఅంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించాలని ఆ వ్యక్తి ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అతనిని కాపాడారు.
ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మసీదు పై అంతస్తు రెయిలింగ్ దాటి, ఒక వ్యక్తి కిందకు దూకబోతుండగా, స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆ భద్రతా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🕋🚨 A security guard at the Masjid al-Haram rushed to intervene after a person tried to take their own life by jumping off the upper floors of the masjid.
The security guard was injured while trying to prevent the person from hitting the ground. Both individuals were… pic.twitter.com/NnpveIE8wf— • (@Alhamdhulillaah) December 25, 2025
ఈ ఉదంతంపై మక్కా ప్రాంతీయ ఎమిరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని నివారించిందని దానిలో కొనియాడింది. అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భద్రతా అధికారికి ఫ్రాక్చర్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితునిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం విచారణ చేపడుతున్నామని మక్కా భద్రతా దళాలు వెల్లడించాయి.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తితో పాటు, గాయపడిన భద్రతా అధికారిని కూడా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ వ్యక్తిని కాపాడటంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు


