సాక్షి, హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎన్‌క్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు.
సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది.


