లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్ టుబాకో టైకూన్ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు.
కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని, బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్ అని పేర్కొన్నారు. కారు కండిషన్ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్ బారిన పడిందన్నారు.
ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా.


