లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కొడుకు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించి ఖరీదైన లంబోర్గిని కారుతో పాదచారుల పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అతడిని పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
UP tobacco trader’s drunk son rams Lamborghini into vehicles and pedestrians in Kanpur, several injured.
Shivam was allegedly drunk and tried to flee before police took action. pic.twitter.com/WDEC8AG9eU— The Tatva (@thetatvaindia) February 9, 2026
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే మరో కారులో అక్కడికి చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి కేకే మిశ్రా బన్షిదర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీకి యజమాని. గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడినవారు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు శివం పేరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి పేరు ఎందుకు లేదనే దానిపై పోలీసులు అధికారులు ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు.


