ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో పలు రాష్ట్రాల ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో ఆరావళి పర్వతాలకు సంబంధించి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. మంచిదే! కానీ ఈ విజ్ఞత ముందేవుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు.
గత ఆదివారం ఆరావళి గురించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పిన కొత్త నిర్వచనమైనా, చుట్టుపక్కల భూమి కన్నా కనీసం వంద మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలన్న ఆ మంత్రిత్వశాఖ సిఫార్సును ఆమోదిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా పర్యావరణ కార్యకర్తలను విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దన్న ఆదేశాలు తప్ప, ఈ పర్వతాలను అమాంతం కబళించే ప్రమాదమున్న కొత్త నిర్వచనానికి స్వస్తి పలుకు తున్నామన్న భరోసా లేదు.
ఈ నేలపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆవిర్భవించిన పర్వతశ్రేణి ఆరావళి. వాటి వయసు 250 కోట్ల సంవత్సరాలంటారు. వాయవ్య భారత్‌లో 670 కిలోమీటర్ల పొడవునా, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూపోయే ఈ ఆరావళిని దశాబ్దాలుగా అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆ పర్వతశ్రేణి పర్యావరణపరమైన ప్రయోజనాలను విస్మరించి, అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలను బేఖాతరు చేసి కాసుల కక్కుర్తితో కొంచెం కొంచెంగా చిదిమేస్తున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్వచనం చెప్పుకుంటూ ఇప్పటికే చాలా భాగాన్ని స్వాహా చేసిన వైనం కనబడుతూనే ఉంది. ఆ పర్వతశ్రేణిలో కేవలం 0.19 శాతంలో మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే 99 శాతానికిపైగా విస్తీర్ణం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కనుక మైనింగ్ ప్రాంతం తక్కువనిపిస్తుంది. కానీ అంకెల్లో చూస్తే అసలు సంగతి బోధపడుతుంది. అది ఏకంగా 68,000 ఎకరాలు! మైనింగ్ సంస్థలు గోరంత లీజుకు కొండంత తవ్వుకుపోవటం మన దేశంలో వింతేమీ కాదు. కనుక వాస్తవంలో ఇది మరింత ఉండొచ్చు.
అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకు అందించిన నివేదిక గమనిస్తే అది ఆరావళిని రక్షించదల్చుకున్నదా... భక్షించే వారికి వంత పాడదల్చుకున్నదా అనే సందేహం తలెత్తుతుంది. ‘ఆరావళిలో ప్రతి భాగమూ పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతమూ ఆరావళిలో భాగం కాదు’ అని అనడంతోపాటు ‘కేవలం ఏటవాలే హద్దుల నిర్ణయానికి గీటురాౖయెతే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంద’ని చెప్పడంలో పర్యావరణహితం ఆవగింజంతైనా కనబడుతోందా? దశాబ్దాల తరబడి అక్కడి అక్రమ, ‘సక్రమ’ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్వతరహిత ప్రాంతాలుంటే ఉండొచ్చు. కానీ పర్యావరణ శాఖ కమిటీగా ‘చేర్చాలన్న’ ఆత్రుత కన్నా మినహాయింపుల వైపే మొగ్గటం సరైందేనా?
మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచి చాన్నాళ్లయింది. దాన్నుంచి వేరు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరావళి ఆవలున్న థార్ ఎడారి చూపుతోంది. అక్కడి ఇసుక తుపాన్లు మన వైపు రాకుండా అడ్డుపడుతున్నవీ, స్థానికంగా భూగర్భజలాలను పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నవీ ఈ పర్వతాలే! ఇంతకూ ఆరా వళి ప్రాంతాన్ని మైనింగ్‌కు ఇవ్వబోమన్న హామీ వినబడుతోంది గానీ... జాతీయ రాజ ధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దాన మైతే ఇంతవరకూ లేదు.
నిజానికి వందమీటర్ల గీటురాయి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి రూపొందించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపున్న చిట్టచివరి ప్రాంతం ఎన్‌సీఆర్. అక్కడ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. కానీ ఇంకా చిన్న గుట్టలు, పొదలూ విస్తారంగా ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిందే! యునెస్కో అరుదైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఆరావళిలో అంగుళం కూడా నష్టపోకూడదు.


